ఈజిప్టులో ఆయిల్ ట్యాంకర్‌పై హైటెన్షన్ వైర్లు పడి 31 మంది సజీవదహనం

ఈజిప్టు రాజధాని కైరాలో బుధవారం రద్దీ రహదారి అయిన రింగ్ రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్ నిండిన ట్రక్కు బోల్తా పడి మంటలు చెలరేగి, సమీపంలోని వాహనాలను చుట్టుముట్టడంతో ఘోర అగ్నిప్రమాదం జరిగిందని ప్రభుత్వ మీడియా నివేదించింది. ఆయిల్ ట్యాంకర్‌పై హైటెన్షన్ వైర్లు పడటంతోనే ప్రమాదానికి దారితీసినట్టు తెలిపింది.
 
ఈ దుర్ఘటలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మందికిపైగా గాయపడ్డారు. జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటంతో మంటలు చెలరేగినట్టు ఈజిప్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు డజన్లకు పైగా కార్లు, మోటార్ సైకిళ్లు పూర్తిగా కాలిపోయి శిథిలమయ్యాయని ఈజిప్టు అధికారులు తెలిపారు.
 
ఘటనా స్థలిలో భారీ అగ్ని కీలలు ఎగిసిపడుతుండగా దట్టమైన పొగ అలముకుని వాహనదారులు హారన్లు మోగిస్తూ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తుంది. చుట్టుపక్కల భవనాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ దళాలు చర్యలు చేపట్టాయి.
ఘటనా స్థలానికి 39 అంబులెన్సులు పంపామని, గాయపడిన 21 మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.
వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. తగలబడిపోతున్న వాహనాలను ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్న భయానక దృశ్యాలు ఘటనా స్థలిలో దర్శనమిస్తున్నాయి. మంటల్లో సజీవదహనమైన బాధితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టామని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈజిప్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
మంత్రి ఖలీద్ అబ్దెల్ గఫార్ సంఘటనా స్థలాన్ని, బాధితులు చికిత్స పొందుతున్న సమీపంలోని ఆసుపత్రులను సందర్శించినట్లు ఈజిప్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఈజిప్టు ప్రధాన మంత్రి ముస్తఫా మద్బౌలీ ఆదేశించారు.‘‘పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు సంబంధించి భవిష్యత్ చర్యలను, అటువంటి రవాణా కార్యకలాపాల సమయంలో భద్రత, రక్షణను నిర్ధారించే చర్యలను’’ నిర్ణయించే ముందు ప్రభుత్వం పూర్తి స్పష్టత కోసం ఎదురుచూస్తోందని ప్రధాని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

ఇటీవల సంవత్సరాల్లో ఈజిప్టు అనేక ఘోరమైన అగ్ని ప్రమాదాలను చవిచూసింది. ఇందుకు కారణం అనధికారిక నివాస ప్రాంతాలు, శిథిలావస్థకు చేరుకున్న మౌలిక సదుపాయాలే. అగ్నిప్రమాదాల నుంచి తప్పించుకునే మార్గాలు, స్మోక్ డిటెక్టర్లు, అలారాలు చాలా అరుదుగా ఉంటాయి. అనేక ప్రాంతాలలో, ఇరుకైన రోడ్ల వల్ల అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకోవడం కష్టంగా ఉంటుంది.

About The Author