డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ ఇండియా లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నాయకత్వంలో ‘నషా ముక్త్ భారత్-హైదరాబాద్ వాక్స్’ పేరుతో 3 రోజుల పాదయాత్ర బుధవారం ప్రారంభమైంది. అంబర్పేట్ మహంకాళి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్రకు విద్యార్థులు, యువత, ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ విద్యా సంస్థల విద్యార్థులు ‘సే నో టు డ్రగ్స్’ ప్లకార్డులు పట్టుకుని, డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
సభా ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా చేతబూని విద్యార్థులతో కలియతిరిగారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్, సినీ హీరో విక్టరీ వెంకటేశ్ తదితరులు పాల్గొని పాదయాత్రకు మద్దతు తెలిపారు.యువతలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ యాత్ర తొలిరోజు అంబర్పేట్ నుంచి ప్రారంభమై ఉస్మానియా వర్సిటీ, ఆర్ట్స్ కాలేజ్, ఇఫ్లూ , గాంధీ ఆస్పత్రి మీదుగా ముషీరాబాద్ చేరుకుంటుంది.
సాయంత్రం కశిష్ ఫంక్షన్ హాల్ వద్ద తొలిరోజు పాదయాత్ర ముగియనుండగా, కిషన్ రెడ్డి అక్కడే బస చేయనున్నారు. రేపు, ఎల్లుండి కూడా కొనసాగనున్న ఈ పాదయాత్ర జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ వరకు సాగనుంది.
దేశ జనాభాలో 25 శాతానికి పైగా ఉన్న విలువైన యువశక్తిని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడం మనందరి బాధ్యత కాగా కొంతమంది దుర్మార్గులు, దేశద్రోహులు డబ్బుల కోసం స్కూళ్లు, కాలేజీల ప్రాంగణాలు, ఆఫీసులు, బస్తీల వద్దకు వచ్చి చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో అమాయకులైన విద్యార్థులకు మత్తుపదార్థాలను అలవాటు చేస్తున్నారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తొమ్మిది నెలలు మోసి, ఎన్నో ఆశలతో పిల్లలను పెంచి చదువుకోవడానికి పంపిస్తుంటే ఈ దేశద్రోహులు డ్రగ్స్ ద్వారా వారిని కుటుంబాలకు, సమాజానికి దూరం చేస్తూ తల్లిదండ్రులను నిరాశ నిస్పృహలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“2047 నాటికి మన దేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దాలంటే ముందుగా మన యువతను కాపాడుకోవాలి. ‘నశా ముక్త్ భారత్’ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యక్రమమో లేదా ప్రభుత్వ కార్యక్రమమో కాదు; ఇది పూర్తిగా ఒక ప్రజా కార్యక్రమం, ప్రజా ఉద్యమం. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి పాఠశాల, కళాశాల యాజమాన్యాలు, కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు ఏకమై మన విద్యార్థుల భవిష్యత్తును, తద్వారా దేశాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలి” అని కిషన్ రెడ్డి పిలపునిచ్చారు.
మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, దేశ యువత భవిష్యత్తును, దేశ అభివృద్ధిని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన సామాజిక సమస్య అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ ఉద్యమం ద్వారా విద్యార్థులు, యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, మత్తు పదార్థాలకు బానిసైన వారిలోనూ మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరకంగా, మానసికంగా దెబ్బతినడమే కాకుండా, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాలు క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వ్యాప్తి దేశ సమగ్రత, సమైక్యతకు కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని చెబుతూకొన్ని విదేశీ శక్తులు దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ఈ తరహా కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ భవిష్యత్తు యువత, విద్యార్థులపైనే ఆధారపడి ఉందని, వారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ నైపుణ్యాలతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
యువతను డ్రగ్స్ వంటి ప్రమాదకర వ్యసనాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ సినీ నటుడు వెంకటేష్ తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత తమ ఆరోగ్యాన్ని, విద్యను, ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యసనం బాధితుల కుటుంబాలు, స్నేహితులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని దూరం పెట్టకుండా, వారికి అండగా నిలిచి వ్యసనం నుంచి బయటపడేందుకు సహాయం చేయాలని సూచించారు.

More Stories
మదురై కొండ స్తంభంపై కార్తిగై దీపం వెలిగించలేదు
నగదు బదిలీలో దేశంలోనే తెలంగాణ టాప్-2, ఏపీ టాప్-4
వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో సెంచరీ…52 బంతుల్లో డబుల్ సెంచరీ!