యలహంక ప్యాలెస్ వివాదంలోకి ఈడి

* వైఎస్ భారతి తల్లి సుగుణమ్మపై ఈడీ, సీబీఐ గురి

యలహంక ప్యాలెస్‌లోకి వైఎస్ షర్మిల వెళ్లకుండా ‘సిలికాన్ బిల్డర్స్’ కోర్టు ద్వారా అడ్డుకోవడం ఇప్పుడు దర్యాప్తు సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆస్తిని 2007లో వైఎస్ భారతి తల్లి ఇ.సి. సుగుణమ్మ సిలికాన్ బిల్డర్స్‌కు లీజుకు ఇవ్వడం, తాజాగా భారతి పేరిట గిఫ్ట్ డీడ్ చేయడంపై ఈడీ, సీబీఐ నిశితంగా పరిశీలిస్తున్నాయి.

జగన్ అక్రమాస్తుల (భారతి సిమెంట్స్/వాన్‌పిక్) కేసులో ఇప్పటికే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతిలతో పాటు సిలికాన్ బిల్డర్స్ కూడా ఈడీ చార్జిషీట్‌లో నిందితురాలిగా ఉంది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థతో ఆస్తి లీజు, తాజా ఆస్తుల బదలాయింపు జరగడంతో ఈ లావాదేవీలపై దర్యాప్తు సంస్థల గురి పడింది. 
 
ఈ నేపథ్యంలో సుగుణమ్మకు ఆ ఆస్తి కొనుగోలుకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? సిలికాన్ బిల్డర్స్ నుండి అందిన లీజు చెల్లింపుల వివరాలపై త్వరలోనే ఈడీ, సీబీఐ ఆమెను వివరణ కోరే అవకాశం కనిపిస్తోంది. బెంగుళూరు యలహంక ప్యాలెస్ జగన్ మామ 2007లో కొన్నట్టు జగన్ చెబుతున్నారు.  బెంగుళూరు ప్రైమ్ ఏరియాలో 23 ఎకరాలు కొనేంత డబ్బు, జగన్ మామ గంగిరెడ్డికి ఉందా? 2001లో జగన్ మామ ఎంపిపిగా పోటీ చేసిన సమయంలో, ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ లో తన ఆస్తి మొత్తం రూ.1.30 లక్షలుగా చూపించారు. 2004లో జగన్ ఆస్తి కేవలం రూ 1.74 కోట్లు మాత్రమే.”

అటువంటిది,  2007లో, రూ.200 కోట్లతో జగన్ మామ, బెంగుళూరు ప్యాలెస్ భూమి 23 ఎకరాలు ఎలా కొన్నారు? ఆ రోజుల్లోనే రూ.100 కోట్లతో ప్యాలెస్ ఎలా కట్టారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దోపిడీ సంపాదన పై, వైఎస్ కుటుంబం రోడ్డున పడి కొట్టుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
కాగా, యలహంక ప్యాలెస్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై దేవనహళ్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ప్యాలెస్‌ తమ సంస్థ లీజులో ఉందని పేర్కొంటూ, వైఎస్‌ షర్మిల అక్కడికి రాకుండా అడ్డుకోవాలని పిటిషనర్‌ కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు, అభ్యంతరాలు వినాల్సి ఉండటంతో తదుపరి విచారణను డిసెంబర్‌ 19కి వాయిదా వేసింది. సోమవారం జరిగిన విచారణకు పిటిషనర్‌ రమేశ్‌బాబు తరఫున న్యాయవాది సుధీర్‌ మేడమ్మయ్య మాత్రమే హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా పిటిషన్‌ దరఖాస్తు ప్రతి, అఫిడవిట్‌లను ప్రతివాదిగా ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు పంపించాలని కోర్టు ఆదేశించింది. కేసులో మరో పక్షం వాదనలు, అభ్యంతరాలు కూడా తెలుసుకోవాల్సి ఉన్నందున షర్మిల తరఫున న్యాయవాది తదుపరి విచారణకు హాజరుకానున్నారు.

About The Author