కరాచీలో నవంబర్ 22న జియే సింధ్ రహబర్ కమిటీ (జేఎస్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో వేలాది మంది ఎర్ర జెండాలు పట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. నాలుగు సింధీ జాతీయవాద పార్టీల కూటమిగా ఉన్న ఈ సంస్థ చేపట్టిన ర్యాలీకి జియే సింధ్ మహాజ్ అధ్యక్షుడు రియాజ్ అలీ చాండియో, నియాజ్ కలానీ తదితర నాయకులు నేతృత్వం వహించారు.
న్యాయవాదులు, పౌర సమాజ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దీంతో నగరంలోని పలు రహదారులను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.కొత్త ప్రావిన్స్‌ల ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్న ప్రతిపాదనను నిరసనకారులు తిరస్కరించారు.
ఇప్పటికే అధికారులు నిర్ణయం తీసుకుని, దానికి ప్రజామోదం పొందేందుకు ప్రజాభిప్రాయ సేకరణను ఉపయోగించుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తమ ఉద్యమం ఉర్దూ మాట్లాడే ప్రజలకు లేదా ఇతర జాతుల సమూహాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. సింధ్ సరిహద్దుల మార్పుపై నిర్ణయం తీసుకునే హక్కు అక్కడి ప్రజలకే ఉండాలని డిమాండ్ చేశారు.
కరాచీతో పాటు హైదరాబాద్, నవాబ్‌షా, లర్కానా తదితర నగరాలు, పట్టణాల్లోనూ నిరసనలు జరిగాయి. సింధ్ జాతీయవాద నాయకులు పాకిస్థాన్ సైనిక వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పంజాబ్ ఆధిపత్యంలోని పాలక వ్యవస్థ సింధ్ భౌగోళిక సమగ్రతను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు.
ప్రావిన్స్‌లోని లక్షల ఎకరాల వ్యవసాయ భూములు, తీర ప్రాంత ద్వీపాలు, చమురు, సహజ వాయువు, బొగ్గు వనరులపై పాలక వ్యవస్థ నియంత్రణ సాధించిందని ఆరోపిస్తున్నారు. జియే సింధ్ ముత్తహిదా మహాజ్ (జేఎస్‌ఎంఎం) అనే వేర్పాటువాద సంస్థ కూడా కరాచీ నిరసనలో పాల్గొంది. ఈ సంస్థ జేఎస్‌ఆర్‌సీలో భాగం కాకపోయినప్పటికీ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది.
పంజాబ్‌పై ఆర్థిక దిగ్బంధం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సింధ్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన తమ ప్రచారాన్ని, సింధుదేశ్ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ఉద్యమంగా విస్తరిస్తామని ప్రకటించింది.
కాగా, కరాచీలో నవంబర్ 29న మరో భారీ ప్రదర్శన నిర్వహించాలని సింధీ జాతీయవాద సంస్థలు నిర్ణయించాయి. అదే రోజు కొత్త ప్రావిన్స్‌ల ఏర్పాటుకు మద్దతుగా ఎంయూక్యూఎం-పీ కూడా ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. పరస్పర భిన్న వైఖరులు కలిగిన సంస్థలు ఒకే రోజు ప్రదర్శనలు నిర్వహించనున్న నేపథ్యంలో పాకిస్థాన్ వాణిజ్య రాజధాని కరాచీలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశముంది.

More Stories
పంజాబ్‌లో బీజేపీ కూటమికి అకాలీదళ్ నాయకత్వం
డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు హసీనా?
ఉగ్రదాడికి ముందే పహల్గాం ప్రాంతంలో చైనా ఉపగ్రహాల నిఘా!