* మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్దియాల్ కంబోజ్ బీజేపీలో చేరిక
ఆప్ మాజీ నేత నవదీప్ సింగ్ సంఘా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ సమక్షంలో బీజేపీలో చేరారు. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ,ముందు ఈ పరిణామం చోటుచేసుకోగా, గత కొన్ని వారాలుగా ఆప్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరుతున్నారు. నవంబర్ 2న ఆప్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు.
కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, చేతన్ సింగ్ జౌరామజ్రా, హర్మీత్ సింగ్ పఠాన్మజ్రాలు న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీలో చేరారు. వీరితో పాటు దర్శన్ సింగ్ డింపీ, రవీందర్ సింగ్, రవీందర్ రాణి, రవీందర్ కౌర్ రాణి, తజిందర్ మోను వంటి స్థానిక నాయకులు కూడా పార్టీలో చేరారు. అలాగే, మాజీ బ్లాక్ అధ్యక్షుడు విజయ్ తివారీ, నరేష్ శర్మ కూడా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వంతో విభేదాల కారణంగానే వీరు ఆప్ పార్టీని వీడారు. మాదకద్రవ్యాల సమస్య, పెరుగుతున్న అప్పులు, పాలనాపరమైన లోపాలు వంటి కీలక సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పఠాన్మజ్రా, జౌరామజ్రాలు ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జౌరామజ్రా, మాదకద్రవ్యాల సమస్యపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశ్నించారు.
మాన్సాలో హత్యకు గురైన మాదకద్రవ్య వ్యతిరేక కార్యకర్త పర్విందర్ సింగ్ జోటా, సంగ్రూర్‌లో ఆత్మహత్య చేసుకున్న దళిత వ్యక్తి గుల్జార్ సింగ్ ఉదంతాలను ఆయన ప్రస్తావించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్న హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని ఆయన విమర్శించారు.
మరోవంక, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్దియాల్ కంబోజ్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం, గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ నుంచి పంజాబ్‌ను కాపాడటానికి బీజేపీయే ఏకైక ఆశాకిరణంగా కనిపిస్తోందని కంబోజ్ తెలిపారు. ఈ రెండు విషయాల్లోనూ రాష్ట్రాన్ని విఫలం చేశాయని ఆయన ఇతర రాజకీయ పార్టీలపై ధ్వజమెత్తారు.
ఈలోగా, ఢిల్లీకి చెందిన ఆప్ నాయకులు పంజాబ్ ప్రభుత్వంపై నియంత్రణ సాధిస్తున్నారని పఠాన్మజ్రా ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు కూడా ఒక్క ఫైల్‌ను కూడా స్వతంత్రంగా ఆమోదించలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీలో చేరడానికి ముందు పఠాన్మజ్రా, జౌరమజ్రాలు ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీచే సస్పెండ్ చేసిన కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, పంజాబ్ అసెంబ్లీకి రాజీనామా చేశారు.

More Stories
యూపీ ఎన్కౌంటర్లో దావూద్ అనుచరుడు నసీమ్ దుర్రానీ హతం
అయోధ్యలో పోటీకి సిద్ధమా? అఖిలేష్ కు యోగి సవాల్
బిజెపి నుండి వైదొలిగిన మాజీ సీఎం కరుణాకరన్ కుమార్తే