హైదరాబాద్లో జరిగిన ‘భారత్ సమ్మిట్ 2026’ వేదికపై యూరోపియన్ సోషలిస్ట్స్ పార్టీ (పీఈఎస్) సెక్రటరీ జనరల్, ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ ‘‘ఓట్ చోర్ – గద్దీ చోడ్’’ అంటూ నినాదాలు చేయించి మన దేశాన్ని తిట్టించిన దుర్మార్గపు చర్య వెనకున్న `మాస్టర్ మైండ్’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇటలీ నేత ఫిలిబెక్ మాట్లాడిన అంశాల స్క్రిప్టు రైటర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొంటూ ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్టను దిగజార్చే కుట్రలకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు ముమ్మాటికీ దేశ ద్రేహులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటలీ మూలాలున్న రాహుల్ గాంధీ, తన అమ్మ సోనియా పుట్టిన దేశమైన ఇటలీ నుంచి ఒక పనికిమాలిన నేతను పిలిపించి, తనను ప్రతిపక్షనేతగా ఎన్నుకున్న వ్యవస్ధను దూషించేలా మాట్లాడించడం సిగ్గుచేటు అంటూ ధ్వజమెత్తారు. ఒక విదేశీ నేత మన దేశాన్ని దూషిస్తుంటే, పక్కనే ఉన్న రాహుల్ గాంధీ వారించాల్సింది పోయి చప్పట్లు కొట్టి ప్రోత్సహించడం ముమ్మాటీకి దేశ వ్యతిరేక చర్యనే అని స్పష్టం చేశారు.
భారత అంతర్గత రాజకీయాల్లో విదేశీయుల జోక్యాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందనడానికి, ఆ పార్టీ నిర్వహించిన ‘భారత్ సమ్మిట్ 2026’ నిదర్శనం అని తెలిపారు. భారత ఎన్నికల సంఘం పనితీరును, ప్రజా తీర్పును ఒక విదేశీ నాయకుడు భారత గడ్డపై నుంచే హేళన చేస్తుంటే అడ్డుకోకుండా స్వాగతించిన సదస్సు నిర్వాహకులపై దేశద్రోహ కేసులు పెట్టాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. విదేశీ శక్తుల సహకారంతో దేశ ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు సదస్సు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.
ఇటలీ నేత జియాకోమో ఫిలిబెక్ ‘కాన్ఫరెన్స్ వీసా’పై భారత్కు వచ్చి, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ వ్యాఖ్యలు చేసారని ఆయన విమర్సించారు. ఫారినర్స్ యాక్ట్ ప్రకారం ఆయన వీసా రద్దు చేసి, దేశం నుంచి బహిష్కరించాలని, భవిష్యత్తులో భారత్లోకి రాకుండా బ్లాక్లిస్ట్ చేయాలని ఇప్పటికే రాంచందర్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారని చెప్పారు.
ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో కరువు తాండవం చేస్తుంటే, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేసిన రేవంత్ రెడ్డి, తన సీఎం సీటును కాపాడుకోవడానికి, రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి ఈ సదస్సు కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేయడం ముమ్మాటికీ అధికార- నిధుల దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు.
More Stories
మూడు మావోయిస్టుల డంప్ లు స్వాధీనం
తెలంగాణ గ్రామాల్లో 95.3 శాతం మందికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు
ఇటలీ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. బిజెపి