లొంగిపోయిన మావోయిస్టులు అందించిన విశ్వసనీయ సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన మూడు డంపులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని పూజారి కాంకేర్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో నిర్వహించిన గాలింపు చర్యల్లో మొత్తం 280 బీజీఎల్ షెల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 16న లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారంతో చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ బృందం సంయుక్తంగా అడవిలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సీపీఐ మావోయిస్టు పార్టీ పి ఎల్ జి ఎ బెటాలియన్‌కు చెందిన మూడు డంపులను గుర్తించారు. ఒక్కో డంపులో సింథటిక్ వాటర్ ట్యాంక్ డ్రమ్‌లో దాచిన బీజీఎల్ షెల్స్‌ను బయటకు తీసి లెక్కించగా మొత్తం 280 ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
2025 ప్రారంభంలో పి ఎల్ జిఎ బెటాలియన్ వికేంద్రీకరణ జరిగిన సమయంలో దాని మొదటి కంపెనీకి చెందిన ఈ షెల్స్‌ను అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు.భవిష్యత్తులో మావోయిస్టు కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నప్పుడు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దట్టమైన అటవీ ప్రాంతాన్ని సురక్షిత స్థావరంగా భావించి డంపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
2025 చివరి భాగం నుంచి 2026 ప్రారంభం వరకు పలువురు మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్, పునరావాస విధానంతో లొంగిపోయిన వారికి నగదు రివార్డులు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమి, స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు,ఆరోగ్య బీమా కార్డులు, నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టులు గతంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డంపుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తున్నారని పేర్కొన్నారు. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు మరికొందరు మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని పోలీసులు తెలిపారు.వారు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ పిలుపునిచ్చింది. మారుతున్న పరిస్థితులను గుర్తించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరింది.

More Stories
ఇటలీ నేతతో దేశాన్ని తిట్టించిన `మాస్టర్ మైండ్’ రేవంత్ రెడ్డి
తెలంగాణ గ్రామాల్లో 95.3 శాతం మందికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు
ఇటలీ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. బిజెపి