అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో), ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా రూపొందించిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్-2024 గణాంకాలను ఈ అధ్యయనం ప్రస్తావించింది. 2022లో ఉద్యోగాలు చేస్తున్న యువ గ్రాడ్యుయేట్లలో 52.8 శాతం మంది తక్కువ నైఫుణ్యం అవసరమైన వృత్తుల్లో పనిచేస్తున్నట్టు తెలిపింది.
గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న ఉద్యోగుల్లో 57.8 శాతం మంది రెగ్యులర్ జీతభత్యాల ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ, కేవలం 36.1 శాతం మందికి మాత్రమే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి లభించినట్టు పేర్కొన్నది. అయితే ఈ గణాంకాల ఆధారంగా వ్యక్తిగతంగా యువతలో నైపుణ్యాల లోపం ఉన్నదని లేదా డిగ్రీల విలువ తగ్గిపోయిందని నిర్ధారించలేమని పరిశోధకులు స్పష్టంచేశారు.
అందరికీ సమానంగా లేని ఉన్నత విద్యా ప్రయోజనాలు
ఉన్నత విద్య ద్వారా లభించే ప్రయోజనాలు అందరికీ సమానంగా ఉండటం లేదని, విద్యాసంస్థల ప్రమాణాలు, చదివిన కోర్సు, ప్రాక్టికల్ అనుభవం వంటి అంశాలపై ఉద్యోగావకాశాలు ఆధారపడుతున్నాయని వివరించారు. ఉన్నత విద్యార్హతలున్న వారి సంఖ్య పెరుగుతున్నా, కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో వారు చదివిన విద్యా సంస్థ, కోర్సు, పరీక్షల్లో సాధించిన ఫలితాలు, ఇంటర్న్షిప్లు, పని అనుభవం, పరిచయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని అధ్యయనం పేర్కొన్నది.
దీనిని పరిశోధకులు క్వాలిఫికేషన్ కంజెషన్గా అభివర్ణించారు. అంటే మెరుగైన సామాజిక, ఆర్థిక స్థితికి డిగ్రీలే ప్రధాన మార్గమని కుటుంబాలు భావిస్తుండగా, ఉద్యోగ మార్కెట్లో మాత్రం డిగ్రీ ఒక్కటే సరిపోవడం లేదని వివరించారు. మరోవైపు ప్రత్యామ్నాయంగా ఉన్న వృత్తి విద్య, సాంకేతిక శిక్షణ అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయి.
5 శాతం మందికే సాంకేతిక శిక్షణ అవకాశాలు
2025 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 15-29 ఏండ్ల వయసున్న వారిలో కేవలం 5 శాతం మందికే అధికారిక వృత్తి లేదా సాంకేతిక శిక్షణ లభించింది. వృతి విద్యా కోర్సులకు గుర్తింపు, తగిన వేతనాలు, ఉన్నత విద్యకు వెళ్లే అవకాశాలు కల్పించాలని అధ్యయనం సూచించింది. అప్పుడే యువత డిగ్రీలపై మాత్రమే ఆధారపడకుండా నైపుణ్య ఆధారిత ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతారని పేర్కొన్నది.
దేశంలో పాఠశాలల వ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని అధ్యయనం తెలిపింది. 2018-19లో 15.51 లక్షలుగా ఉన్న పాఠశాలల సంఖ్య 2025-26 నాటికి 14.67 లక్షలకు తగ్గింది. అంటే 84 వేల పాఠశాలలు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే బోధించే ప్రాథమిక పాఠశాలల సంఖ్య 8.27 లక్షల నుంచి 7.22 లక్షలకు పడిపోయింది.
అదే సమయంలో 12వ తరగతి వరకు విద్య అందించే పాఠశాలలు 1.30 లక్షల నుంచి 1.69 లక్షలకు పెరిగాయి. దేశంలో జననాల రేటు తగ్గడం, ప్రాథమిక పాఠశాల వయసున్న పిల్లల సంఖ్య క్షీణించడం ఇందుకు కారణాల్లో ఒకటిగా పరిశోధకులు పేర్కొన్నారు.
ఉన్నత విద్యలో అధ్యాపకుల కొరత
2014-15 నుంచి 2023-24 మధ్య దేశంలో ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు 31.5 శాతం పెరిగింది. 3.42 కోట్ల నుంచి 4.50 కోట్లకు చేరింది. అయితే అధ్యాపకుల సంఖ్య అదే స్థాయిలో పెరగలేదని అధ్యయనం గుర్తించింది. ఇదే కాలంలో అధ్యాపకుల సంఖ్య 14.73 లక్షల నుంచి 17.32 లక్షలకు మాత్రమే పెరిగింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోనూ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధ్యయనం పేర్కొన్నది. 2023 మార్చి నాటి గణాంకాల ప్రకారం ఐఐటీల్లో 39 శాతం, ఐఐఎంలలో 31 శాతం, ఎన్ఐటీల్లో 29 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

More Stories
విపత్తు సంసిద్ధతను శాశ్వత ఎజెండాగా మార్చిన గుజరాత్ భూకంపం 2001
టీవీఎస్ గ్రూప్ ఆస్తుల పంపకంపై కుమార్తె పట్టు
ఔషధాల ధరల నియంత్రణ కోసం జాతీయ విధానం