ఔషధాల ధరల నియంత్రణ కోసం జాతీయ విధానం

* ప్రధాని మోదీకి ఎంపీ లింగమనేని రమేశ్ వినతి 

దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో లభించేలా సమగ్రంగా నేషనల్ ఎఫర్డబుల్ మెడిసిన్స్ పాలసీ తీసుకురావాలని జనసేన పార్టీ  రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ ప్రధానికి పంపిన వినతిపత్రంలో ఇటీవల 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్లను హేతుబద్ధీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.ఈ నిర్ణయం క్యాన్సర్ రోగులకు, వారి కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. 

 
ఇదే తరహాలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల ధరలను కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పెరుగుతున్న వైద్య ఖర్చుల వల్ల కోట్లాది భారతీయ కుటుంబాలపై ఆర్థిక భారం తీవ్రంగా పెరుగుతోందని, క్షేత్రస్థాయిలో ప్రజలు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారని ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు. 
 
ఫార్మాస్యూటికల్ సరఫరా వ్యవస్థలో వివిధ దశల్లో ఉంటున్న భారీ మార్జిన్ల వల్ల రోగులపై అదనపు భారం పడుతోందని, దీనిపై సమగ్ర సమీక్ష జరిపి, అత్యవసర, ప్రాణాధార మందుల ట్రేడ్ మార్జిన్లపై శాస్త్రీయ, పారదర్శక పరిమితులను విధించే అంశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లో ‘ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన’ను మరింత విస్తరించాలని రమేశ్ కోరారు.
 
నాణ్యమైన జెనరిక్ మందులు నిరంతరాయంగా లభించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరిన్ని జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య బీమా పథకాలతో మరింత సమర్థవంతంగా అనుసంధానం చేయాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క కుటుంబం కూడా అప్పులపాలు కాకూడదని, వైద్యానికి దూరం కాకూడదని స్పష్టం చేశారు.

మలేరియా, ఇతర అంటువ్యాధులతో బాధపడుతున్న గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రస్తావిస్తూ, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీ కోరారు. అక్కడ ప్రాథమిక వైద్య సదుపాయాలను బలోపేతం చేసి, సకాలంలో వ్యాధి నిర్ధారణ, తగినన్ని మందుల లభ్యతతో పాటు వైద్య సేవలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. 

 
అదే సమయంలో, మార్కెట్లలో చలామణి అవుతున్న నకిలీ, నాణ్యత లేని మందులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనిఖీలను ముమ్మరం చేసి, కఠినమైన నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని, డిజిటల్ మెడిసిన్-ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, నకిలీ మందుల తయారీ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫార్మా మార్కెటింగ్,  ప్రిస్క్రిప్షన్ విధానాల్లో మరింత పారదర్శకత అవసరమని పేర్కొంటూ, అనైతిక ప్రలోభాలను అరికట్టేందుకు రోగుల ప్రయోజనాలే పరమావధిగా ఉండేలా ప్రస్తుత నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. మందుల ధరల నియంత్రణ, నాణ్యతా ప్రమాణాల అమలు కోసం నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ), కేంద్ర-రాష్ట్ర డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీలు, జిల్లా యంత్రాంగాల మధ్య పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులుగా ఉన్న  వైద్య నిపుణులతో  మందుల ధరల తగ్గింపు, వైద్య సేవల లభ్యతపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని ఎంపీ ప్రతిపాదించారు. దేశ ప్రజా సంక్షేమ ప్రయాణంలో ప్రతి కుటుంబానికి అందుబాటు ధరల్లో మందులు, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే తదుపరి లక్ష్యం కావాలని లింగమనేని రమేశ్ ఆకాంక్షించారు.  వైద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకొస్తే ప్రధానమంత్రి పేరు చరిత్రలో నిలిచిపోతుందని, నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకుడు మాత్రమే ఇలాంటి సాహసోపేతమైన పని చేయగలరని ఈ సందర్భంగా ఎంపీ రమేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

About The Author