భారత్ సమ్మిట్ 2026 వేదికగా భారతదేశ అంతర్గత రాజకీయాలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇటలీకి చెందిన విదేశీ రాజకీయ నాయకుడు జియాకోమో ఫిలిబెక్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్వో) అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ శంషాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లి పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (పీఈఎస్) సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్పై అధికారికంగా ఫిర్యాదు సమర్పించింది. నవంబర్ 14న హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో జియాకోమో ఫిలిబెక్ పాల్గొనడం, ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది.
భారత్ సమ్మిట్ వేదికగా భారతదేశ అంతర్గత ఎన్నికల రాజకీయాలను ఉద్దేశించి ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ అంటూ ఆ విదేశీ నేత రాజకీయ నినాదాలు చేయడాన్ని ఫిర్యాదులో ప్రధానంగా ప్రస్తావించారు. ఆ విదేశీ ప్రతినిధి ఏ కేటగిరీ వీసాపై భారత్‌కు వచ్చారు? పర్యటనకు ప్రకటించిన ఉద్దేశం ఏమిటి? భారత ఇమ్మిగ్రేషన్ చట్టాలను పాటించారా? అనే అంశాలపై లోతైన విచారణ జరపాలని కోరారు.
భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఆ విదేశీ రాజకీయ నాయకుడు తన వీసా నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించారని తెలంగాణ బీజేపీ అనుమానం వ్యక్తం చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025లోని సెక్షన్లు 23, 24 ప్రకారం విచారణ చేపట్టి, చట్ట ఉల్లంఘనలు నిర్ధారణైతే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విదేశీ రాజకీయ నాయకుడి వ్యాఖ్యలకు సంబంధించి ముందస్తు సమన్వయం, సహకారం లేదా ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనకు ప్రేరేపించడం వంటి అంశాల్లో భారత్ సమ్మిట్ నిర్వాహకుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భారత్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు, పొలిటికల్ క్లియరెన్స్‌లు పొందారా లేదా అనేది పరిశీలించాలని సూచించారు.
విదేశీ ప్రతినిధికి పంపిన ఆహ్వాన పత్రాలు, వీసా దరఖాస్తులు, అధికారులకు సమర్పించిన డిక్లరేషన్లు, నిర్వాహకులతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. విచారణలో కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించిన ఆధారాలు వెల్లడైతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధ్యులైన సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు.
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025లోని సెక్షన్ 29 ప్రకారం చట్టపరమైన కారణాలు నిర్ధారణైతే, ఆ విదేశీ రాజకీయ నాయకుడిని భారత్ నుంచి బహిష్కరించే చర్యలను సైతం పరిశీలించాలని చెప్పారు. భారత చట్టాల ఉల్లంఘనకు ఉద్దేశపూర్వకంగా సహకరించినట్లు తేలిన నిర్వాహకులు, స్పాన్సర్లు, ఇతర వ్యక్తులందరిపైనా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ హోదా, అంతర్జాతీయ స్థాయి పదవి ఏదైనా సరే.. విదేశీ పౌరులెవరూ భారత చట్టాలకు అతీతులు కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. భారతదేశం సార్వభౌమాధికారమున్న రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశమని, విదేశీ రాజకీయ నాయకులైనా భారత ఇమ్మిగ్రేషన్ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని శ్రీ ఎన్. రాంచందర్ రావు తేల్చిచెప్పారు.

More Stories
ఇటలీ నేత ‘వోట్ చోర్’ నినాదం ‘దేశద్రోహం’.. బీజేపీ మండిపాటు
రాజీవ్ జపమే గాని పెట్టుబడుల ప్రస్తావన లేని ‘భారత్ సమ్మిట్’
ఆప్ మాజీ ఎంపీలకు పంజాబ్ బీజేపీలో కీలక బాధ్యతలు!