జాకీర్ నాయక్ సంస్థపై నిషేధాన్ని మరో 5 ఏళ్ళు పొడిగింపు

వివాదాస్పద బోధకుడు జాకిర్ నాయక్ యొక్క ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) దేశ భద్రతకు హానికరమైన కార్యకలాపాలకు పాల్పడుతోందని, శాంతి, మత సామరస్యాలకు భంగం కలిగించే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొంటూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆ సంస్థపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 (37 ఆఫ్ 1967)లోని సెక్షన్ 3, సబ్-సెక్షన్ (1) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఐఆర్ఎఫ్ ను చట్టవిరుద్ధ సంఘంగా ప్రకటించామని, దీనిని చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) ట్రిబ్యునల్ సమర్థించిందని ఒక గెజిట్ నోటిఫికేషన్‌లో మంత్రిత్వ శాఖ తెలిపింది.

గతంలో విధించిన నిషేధం నవంబర్ 14తో ముగియనుంది. “ ఐఆర్ఎఫ్, దాని సభ్యులు, ముఖ్యంగా  ఐఆర్ఎఫ్  వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ జాకీర్ అబ్దుల్ కరీం నాయక్ (అలియాస్ డాక్టర్ జాకీర్ నాయక్), మతపరమైన ప్రాతిపదికన వివిధ మత వర్గాల మధ్య అశాంతిని, శత్రుత్వాన్ని, ద్వేషాన్ని లేదా దురభిప్రాయాలను ప్రేరేపించేలా లేదా అందుకు ప్రయత్నించేలా తమ అనుచరులను ప్రోత్సహిస్తున్నారని, వారికి సహాయపడుతున్నారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇటువంటి చర్యలు దేశ సమగ్రతకు, భద్రతకు హానికరమైనవి” అని ప్రభుత్వం పేర్కొంది. నాయక్ చేసిన ప్రకటనలు, ప్రసంగాలు అభ్యంతరకరమైనవి, విద్రోహకరమైనవి. ఆయన వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని, ద్వేషాన్ని ప్రోత్సహిస్తూ, భారతదేశంలోనూ, విదేశాలలోనూ ఒక నిర్దిష్ట మతానికి చెందిన యువతను ఉగ్రవాద చర్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారని అందులో పేర్కొన్నారు. నాయక్ అంతర్జాతీయ శాటిలైట్ టీవీ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి తీవ్రవాద ప్రకటనలు, ప్రసంగాలు చేశారని అందులో తెలిపారు.

ఐఆర్ఎఫ్  చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను వెంటనే అరికట్టి, నియంత్రించకపోతే, అది తన విధ్వంసకర చర్యలను కొనసాగిస్తుంది. ఇంకా పరారీలో ఉన్న తన కార్యకర్తలను తిరిగి సమీకరించుకుని, ప్రజల మనస్సుల్లో మతపరమైన విద్వేషాలను నింపడం ద్వారా దేశ లౌకిక స్వరూపానికి భంగం కలిగిస్తుందని,  దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తుంది అని పేర్కొంది.

ఈ సంస్థ మిలిటెన్సీకి మద్దతు ఇవ్వడం ద్వారా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుందని, అలాగే దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. “పైన పేర్కొన్న కారణాల దృష్ట్యా, ఐఆర్ఎఫ్  కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని, ఆ సంస్థను తక్షణమే ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించడం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది” అని పేర్కొంది.

About The Author