విదేశీ పౌరుల కోసం వీసా ప్రక్రియను సులభతరం చేయడానికి వీసా ప్రాసెస్ ను సులభతరం చేసేందుకు కేంద్రం ప్రధాన భారతీయ వీసా విభాగాలను 13 నుంచి తొమ్మిదికి, ఉపవిభాగాలను 49 నుంచి 23కు తగ్గించింది. వీసా దరఖాస్తు ఫారాల్లోని ఫీల్డ్‌లను కూడా 65-70 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కొత్త విధానంలో వ్యాపార, దౌత్య, పని, జర్నలిస్ట్, వైద్య, అధికారిక, విద్యార్థి, సందర్శక, ఇతర అనే తొమ్మిది ప్రధాన వీసా కేటగిరీలు ఉంటాయి.
కొత్త విధానంలో టూరిస్ట్ వీసా పేరును విజిటర్ వీసాగా మార్చారు. పర్యాటకంతో పాటు మరికొన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక సందర్శన అవసరాలను కూడా ఈ కేటగిరీ పరిధిలోకి తీసుకొచ్చారు. దీనిని వి-1, వి-2 అనే రెండు ఉప కేటగిరీలుగా విభజించారు. వి-1 వీసా కింద వ్యాపార సమావేశాలు, వైద్య సంప్రదింపులు, వెల్నెస్ రిట్రీట్లు, స్వల్పకాలిక వైద్య చికిత్సలకు అనుమతి ఉంటుంది.
అలాగే భారతీయ భాషలు, సంగీతం, కళలు, చేతివృత్తులకు సంబంధించిన స్వల్పకాలిక కోర్సుల్లో పాల్గొనవచ్చు. ఈ వీసాను 30 రోజుల కాలపరిమితితో, పలుమార్లు భారత్‌లోకి వచ్చి వెళ్లే అవకాశం కల్పిస్తూ మంజూరు చేస్తారు. వి-2 వీసా దీర్ఘకాలిక సందర్శనల కోసం ఉద్దేశించారు. అవసరాన్ని బట్టి ఒకటి, ఐదు లేదా పదేళ్ల కాలపరిమితితో ఈ వీసా జారీ చేస్తారు.
వి-1 కింద అనుమతించిన కార్యకలాపాలతో పాటు పర్వతారోహణకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. పర్వతారోహణ కోసం ఆరు నెలల కాలపరిమితితో బహుళ ప్రవేశాల వీసా మంజూరు చేస్తారు. ప్రస్తుతం 172 దేశాల పౌరులకు భారత్ ఇ-వీసా సౌకర్యం అందుబాటులో ఉంది. ఇందులో 13 ఉప కేటగిరీల కింద దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నారు. కొత్త విధానంలో వీసా కేటగిరీలను సరళీకరించడం ద్వారా ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కేంద్రం భావిస్తోంది.
విద్యార్థి వీసా కేటగిరీని రెండు ఉప విభాగాలుగా ఏకీకృతం చేశారు. ఎస్-1 వీసా కింద పాఠశాల విద్యతో పాటు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను చేర్చారు. ఎస్-2 వీసా కింద పీహెచ్డీ, పరిశోధన, విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పించారు. విద్యా ప్రయోజనాలను బట్టి సరైన వీసాను ఎంచుకునేందుకు ఈ విభజన ఉపయోగపడనుంది.
వ్యాపార వీసాను కూడా బి-1, బి-2 అనే రెండు ఉప విభాగాలుగా మార్చారు. బి-1 వీసా దీర్ఘకాలిక, లైసెన్స్ ఆధారిత వ్యాపార కార్యకలాపాల కోసం ఉద్దేశించారు. బి-2 వీసా స్వల్పకాలిక, కాంట్రాక్ట్ ఆధారిత వ్యాపార కార్యకలాపాలకు వర్తిస్తుంది. వ్యాపార అవసరాల స్వభావాన్ని బట్టి వీసా ఎంపిక చేసుకునేలా ఈ మార్పులు చేశారు. వీసా వ్యవస్థను మరింత క్రమబద్ధంగా, పారదర్శకంగా మార్చడమే ఈ మార్పుల లక్ష్యమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరించింది.

More Stories
కుల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పులతో విశాఖ సదస్సుకు అమిత్ షా దూరం
కుల్గామ్‌లో సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రదాడి.. ముగ్గురికి గాయాలు
ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 50 నగరాల్లో 49 భారత్ లోనే