కుల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పులతో విశాఖ సదస్సుకు అమిత్ షా దూరం

 
* ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అదృశ్యం
సాగరతీరం విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనవలసి  కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది.
“అనివార్య కారణాలు” వల్లన ఆయన పర్యటన రద్దయిందని, ఆయనకు బదులుగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సదస్సును ప్రారంభించనున్నారని చెబుతున్నారు. 

బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు కుల్గామ్ జిల్లా ఆఖ్రాన్‌లో, మీర్ బజార్ సమీపంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్ వద్ద బైక్‌పై వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది.  ఈ ఉగ్రవాద దాడిలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది మహమ్మద్ లతీఫ్ భట్ ప్రమేయం ఉండవచ్చని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనుమానిస్తున్నారు.
 
మరోవంక, కిష్త్వార్ జిల్లా, దాచ్చన్ ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశాల నుంచి ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో భద్రతా దళాలు భారీ సంయుక్త గాలింపు చర్యలను ప్రారంభించాయి.  అదృశ్యమైన వారిని బాబీ చంద్ (57), రాశ్పాల్ కుమార్ (45)గా గుర్తించారు. వీరు ఇద్దరూ దాచ్చన్‌లోని కియార్ గ్రామంలో ఉన్న స్థానిక పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు కియార్ క్యాంపు నుంచి ధర్నా-మార్వాలోని ఆర్మీ పోస్ట్‌కు వెళ్తుండగా, గమ్యస్థానానికి చేరుకోలేదు. మొదట్లో వారి మొబైల్ ఫోన్లు అందుబాటులోనే ఉన్నప్పటికీ, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాయి. 
 
లోయలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో ఓ సైనిక శిబిరంపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేవలం 15 సెకన్లలోనే సుమారు 30 రౌండ్లు పేల్చారని సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. ఈ దాడిలో రాకేష్ దాస్, సంతోష్ చంద్రు, సోమ్‌వీర్ సింగ్ అనే ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.  వారిని అనంతనాగ్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడినట్లు అధికారులు తెలిపారు. 
 
దాడి వార్త తెలియగానే ఢిల్లీలో హోంశాఖ ఉన్నతాధికారులతో అత్యవసర భద్రతా సమీక్షలు మొదలయ్యాయి. పరిస్థితిని నేరుగా పర్యవేక్షించేందుకే షా విశాఖ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది.  జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా కుల్గాంలోనే ఉన్నారు. కానీ దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో లేరు. ఆ తర్వాత సంఘటనా స్థలం నుండి వచ్చిన దృశ్యాలలో, గాయపడిన సైనికులను స్ట్రెచర్లపై ఆసుపత్రికి తరలిస్తుండగా, వైద్య సిబ్బంది వారికి సహాయం చేయడానికి పరుగెత్తుకు రావడం కనిపించింది.  

About The Author