యమునా నదిపై తొలిసారిగా వినోదాత్మక క్రూయిజ్‌ సర్వీస్‌

దేశ రాజధాని ఢిల్లీ పర్యాటక రంగంలో మరో కొత్త ఆకర్షణ అందుబాటులోకి రానుంది. యమునా నదిపై తొలిసారిగా వినోదాత్మక క్రూయిజ్‌ సర్వీస్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ సేవలను మంగళవారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సర్దార్‌ తరంజిత్‌ సింగ్‌ సంధు, ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

యమునా నదిలోని సోనియా విహార్‌-జగత్‌పూర్‌ మార్గంలో ఈ క్రూయిజ్‌ సర్వీస్‌ను అభివృద్ధి చేశారు. ఢిల్లీ ప్రజలతో పాటు పర్యాటకులకు నదిపై విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. నదీ పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు రాజధానిలో మరో వినోద కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ క్రూయిజ్‌ సేవల్లో విద్యుత్‌తో నడిచే పడవలను వినియోగించనున్నారు. తద్వారా పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానాన్ని ప్రోత్సహించడంతో పాటు అంతర్గత జలమార్గాల వినియోగ సామర్థ్యాన్ని చాటిచెప్పనున్నారు. గత నెలలోనే ఈ క్రూయిజ్‌ నౌకకు సంబంధించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ, ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి.

జాతీయ జలమార్గాల చట్టం-2016 ప్రకారం యమునా నదిని జాతీయ జలమార్గం-110గా గుర్తించారు. ఈ నేపథ్యంలో నదిపై పర్యాటక, వినోదాత్మక ప్రయాణ సేవలను అభివృద్ధి చేయడం కీలక ముందడుగుగా భావిస్తున్నారు. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐడబ్ల్యుఏఐ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ, ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (డిటిటిడిసి), ఢిల్లీ జల్‌ బోర్డు, నీటిపారుదల, వరద నియంత్రణ శాఖల సహకారంతో ఈ సేవలను అభివృద్ధి చేశారు. 

About The Author