దీపావళి వేడుకల సందర్భంగా బాణసంచాకు సంబంధించిన అగ్నిప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ముంబై వ్యాప్తంగా రాకెట్లు, ఇతర గాలిలోకి ఎగిరే బాణసంచా వాడకాన్ని 2026 నవంబర్ 25 వరకు నిషేధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వచ్చింది. ముంబై పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీ ఛైర్పర్సన్ (ఇన్చార్జ్) హోదాలో బీఎంసీ కమిషనర్ ప్రజ్ఞా లవంగారే-వర్మ ఈ ఉత్తర్వును జారీ చేశారు.
ఇది పౌర సంస్థ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాంగణాలలో గాలిలోకి ఎగిరే రాకెట్లు, అలాంటి బాణసంచా వాడకాన్ని నిషేధిస్తుంది. నవంబర్ 8న ముంబై ఫైర్ బ్రిగేడ్కు అగ్నిప్రమాదాలకు సంబంధించి 142 కాల్స్ రాగా, వాటిలో 137 బాణసంచాకు సంబంధించినవని నివేదికలు వెలువడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డోంగ్రీ, విద్యావిహార్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక సంఘటనలు నమోదయ్యాయి.
బీఎంసీ ఉత్తర్వు ప్రకారం, ఈ ఆంక్షలు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రదేశాలకు వర్తిస్తుంది. ఇందులో నివాస భవనాల పైకప్పులు, బాల్కనీలు, ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాలు, మురికివాడలు, ఇతర ఆవరణలు ఉన్నాయి. అందువల్ల, నివాసితులు తమ ఇళ్ల నుండి గానీ, ప్రైవేట్ బాల్కనీల నుండి గానీ రాకెట్లు లేదా అలాంటి గాలిలోకి ఎగిరే బాణసంచాను కాల్చడానికి అనుమతించరు.
గాలిలో ఎగిరే బాణసంచా కాలిపోయిన అవశేషాలు పైకప్పులు, బాల్కనీలు, కిటికీలు, ఇతర మండే పదార్థాలపై పడటం వల్ల కలిగే ప్రమాదాన్ని పౌర పరిపాలన యంత్రాంగం నొక్కి చెప్పింది. ముఖ్యంగా ముంబైలోని జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలు, బహుళ అంతస్తుల భవనాలు, రద్దీగా ఉండే నివాస ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు అగ్నిప్రమాదాలకు దారితీయవచ్చు.
ఈ ఆంక్షలను అమలు చేసే బాధ్యతను పోలీసు జోనల్ డిప్యూటీ కమిషనర్లు, బీఎంసీ డిపార్ట్మెంటల్ అసిస్టెంట్ కమిషనర్లు, అగ్నిమాపక దళానికి అప్పగించారు. ఈ ఉత్తర్వుల గురించి ప్రజలకు విస్తృతంగా తెలిసేలా చూడాలని కూడా అధికారులను ఆదేశించారు. పండుగ సమయంలో అగ్ని ప్రమాదాలను నివారించడం, ప్రజల భద్రతను కాపాడటం ఈ ఆంక్షల లక్ష్యం. పండుగ సీజన్లో బాణసంచా కాల్చేటప్పుడు, ప్రజలు ఈ ఆంక్షలపాటించాలని, బాణసంచా ఉపయోగించే ముందు వర్తించే నిబంధనలను సరిచూసుకోవాలని సూచించారు.

More Stories
దీపావళి తర్వాత ఢిల్లీ గాలి నాణ్యత ‘అత్యంత అధ్వాన్నం’
దీపోత్సవ వేడుకల్లో 30 లక్షల దీపాలతో వెలిగిపోతున్న అయోధ్య
ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకునేందుకు మరో అవకాశం!