అనంతపురంలో మేయర్ ఓటమిపై భగ్గుమంటున్న కమలదళం

మూర్తి సుబ్రహ్మణ్యం 

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కూటమి అనంతపురం కార్పొరేషన్‌లో మాత్రం బీజేపీ ఓడిపోవడాన్ని కమలదళాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కూటమిలో జరిగిన అంతర్గత కుట్రల వల్లే తాము ఓడిపోయామని, తమకు ఆ స్థానం వద్దంటున్నా బలవంతంగా- వ్యూహాత్మకంగా అంటకట్టారని బీజేపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు.

తమ అభ్యర్థులపై రెబెల్‌గా పోటీ చేసిన వారిని ఉపసంహరింప చేయడంలో, మంత్రి కేశవ్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎన్నిసార్లు అభ్యర్ధించినా కేశవ్ పట్టించుకోలేదంటున్నారు. ఈ అంశంలో ‘మంగళగిరి సమన్వయకర్తలు’ సైతం అంటీముట్టనట్లు వ్యవహరించినట్లు బీజేపీ నేతలు ఢిల్లీకి పంపిన ఫిర్యాదులో స్పష్టం చేసినట్లు సమాచారం.

బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం సీట్ల సర్దుబాటు సమయంలో అనంతపురం జనరల్‌గా భావించిన బీజేపీ ఆ స్థానం తమకు కావాలని కోరింది. కారణం అక్కడ కమ్మ వర్గానికి చెందిన బలమైన నాయకుడు సందిరెడ్డి శ్రీనివాస్ ఉండటమే. అయితే అది బీసీ రిజర్వేషన్‌గా మారడంతో, దానికి బదులు రాయలసీమలో తిరుపతి ఇవ్వాలని కోరారు.    అందుకు అంగీకరించని టీడీపీ నాయకత్వం అనంతపురం కావాలని మీరే కోరినందున, ఆ సీటు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఆ క్రమంలో చేసేది లేక బీజేపీ జిల్లా అధ్యక్షుడిని పోటీ చేయాలది కోరగా, అందుకు ఆయన తన నిస్సహాయత వ్యక్తం చేశారట. పైగా ఆయన ఓటు కూడా కార్పొరేషన్ పరిథిలో లేదన్నారట.  ఈలోగా పార్టీలో లేని తన సమీప బంధువును ఓ నేత తెరపైకి తీసుకువచ్చారట. అయితే ఆయన ను పార్టీలో చేరాలని బీజేపీ నాయకులు కోరినా, పార్టీలో చేరలేదంటున్నారు. ఇక దానితో బీజేవైఎం రాష్ట్ర నేత అజేశ్ యాదవ్‌ను  మేయర్ బరిలోకి దింపాల్సి వచ్చిందని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో వివరించారట.

ఈ విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. మేయర్ అభ్యర్ధి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కొడుకు కావడంతో, ఆయన అభ్యర్ధిత్వంపై బీజేపీ శ్రేణులే విముఖంగా ఉన్నాయన్న ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఆయన తండ్రి కొన్నేళ్ల క్రితమే కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన, చిన్న స్థాయి నాయకుడ గుర్తు చేస్తున్నారు. 
 
అయితే మేయర్‌గా పోటీ చేసిన  అజేశ్ యాదవ్  కొత్తవాడు కాదని,  బీజేవైఎం రాష్ట్ర నేతగా పనిచేస్తున్న విషయాన్ని వ్యూహాత్మకంగా విస్మరించి, దుష్ర్పచారం చేస్తున్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తీరా ఎన్నికల సమయంలో ఐదు డివిజన్లలో టీడీపీ అభ్యర్ధులు, రెబెల్‌గా పోటీ చేయడంతో బీజేపీ నేతలు తలపట్టుకున్నారట. వారిని కావాలనే బరిలోకి దింపారంటున్నారు. 
 
వారిని బరి నుంచి తప్పించాలని బీజేపీ కీలక నేతలు, మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఎన్నిసార్లు చెప్పినా ఆయన స్పందించలేదంటున్నారు. దానితో సమస్యను ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లారట.  తర్వాత బీజేపీ నేతలు మంగళగిరిలోని సమన్వయకర్తలతో సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు మాట్లాడినా, వారు సైతం పోలింగ్ వరకూ అంటీముట్టనట్లు వ్యవహరించారని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారట.

ప్రచార సమయంలో కూడా టీడీపీ నేతలు ఏమాత్రం సహకరించలేదని, ఒకవేళ అనంతపురంలో తమ పార్టీ గెలిస్తే, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఎక్కడ అడుగుతారోనన్న ముందస్తు వ్యూహంతోనే పనిచేశారని బీజేపీ నేతలు స్పష్టం చేశారట. దీని వెనక చాలా శక్తులు పనిచే శాయంటున్నారు.  అందుకే కావాలని తమకు అనంతపురం మేయర్ సీటు అంటకట్టారని,  పైగా స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కూడా తమ పార్టీ ఓటమికి మరో ప్రధాన కారణమంటున్నారు. 

“రిజర్వేషన్ల ఖరారు తర్వాత అనంతపురం కార్పొరేషన్‌ను వద్దన్నా, మాకు బలంవంతంగా అంటకట్టారు. మాకు ఏ స్థాయిలోనూ సహకారం లేదు. రెబెల్స్‌ను విత్‌డ్రా చేయించాలని మంత్రి  కేశవ్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీసు కీలక వ్యక్తుల వరకూ ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అసలు ఎవరూ స్పందించలేదు. అందుకే మేం ఓడాం. ఇక్కడ ఇప్పుడు గెలిస్తే రేపు ఎమ్మెల్యే సీటు అడుగుతారన్న భయంతోనే మమ్మల్ని ముందే ఓడించారరన్నది మా కార్యకర్తల భావన” అని ఓ సీనియర్ బిజెపి నాయకుడు తెలిపారు.  
 
“అయితే ఇవన్నీ బయటకు చెప్పలేని విషయాలు. ఢిల్లీ నుంచి కూడా కూటమిని ఇబ్బంది పెట్టవద్దన్న ఆదేశాలున్నాయి. అందువల్ల  మా నిస్సహాయ పరిస్థితిని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. అయితే మీడియాలో వస్తున్నట్లు మమ్మల్ని ఢిల్లీ నాయకులేమీ వివరణ అడగలేదు. బలం లేకపోయినా ఎందుకు తీసుకున్నారంటూ వస్తున్న కథనాలన్నీ తప్పు. మేమే ఉన్న వాస్తవాలు పార్టీ దృష్టికి నివేదిక రూపంలో తీసుకువెళ్లాం’’ అని ఆ నేత వివరించారు. 
 
(మహానాడు నుంచి)

About The Author