ఇక ఇతర జిల్లాల్లో ఎక్కడా గౌరవనీయ స్థాయిలో జడ్పీటీసీ స్థానాలు దక్కించుకున్న దాఖలాలు లేవు. వైఎస్సార్సీపీకు గట్టి పట్టుందని భావించే రాయలసీమలోనూ ఆ పార్టీని మట్టి కరిపించింది. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని పులివెందులలోనూ వైఎస్సార్సీపీకు చావుదెబ్బ తప్పలేదు. ఇటీవల పులివెందుల మున్సిపాలిటీలో ఘన విజయం సాధించిన కూటమి ఇప్పుడు అక్కడ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్నీ గెలుచుకుని జగన్ సొంత గడ్డపై వైఎస్సార్సీపీ ఓటమిని సంపూర్ణం చేసింది.
రాష్ట్రంలో మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకు 77 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు ఈ నెల 5న పోలింగ్ జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయానికి వెలువడిన ఫలితాల్లో అధికార కూటమి 473 స్థానాలు గెలిచింది. వైఎస్సార్సీపీ 57 స్థానాలకే పరిమితమైంది. మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలకుగాను 2,051 ఏకగ్రీవమవగా, 7,767 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 3 చోట్ల ఎన్నికలు జరగలేదు.
కడపటి ఫలితాలు వెలువడేసరికి కూటమి 5,819 స్థానాల్లో విజయంతో దూసుకెళ్లగా వైఎస్సార్సీపీ 1,583 స్థానాలు గెలిచింది. మొత్తం ఎంపీపీల్లో రెండు మూడు తప్ప మిగతావన్నీ కూటమికే దక్కనున్నాయి. కూటమి మధ్య సమన్వయం లేక, స్థానికంగా గ్రూపు రాజకీయాల కారణంగా రెబల్స్‌గా బరిలోకి దిగినవారిలో కొందరు గెలిచారు. వారు కూటమివైపే వచ్చే అవకాశముంది.
2021లో వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సమరంలో పల్నాడు జిల్లాలో టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. ఇప్పుడు ఆ జిల్లాలోని జడ్పీటీసీ స్థానాలన్నీ కూటమికే దక్కాయి. మార్కాపురం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ అదే సీన్! అక్కడా జడ్పీటీసీ పోరులో వైసీపీ బోణీ కొట్టలేకపోయింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూటమి క్లీన్‌స్వీప్ చేసేసింది. అక్కడ ‘పరిషత్’లో వైసీపీ ఉనికి శూన్యం! ‘పరిషత్’ పోరులో వైసీపీ కంచుకోటలను కూడా టీడీపీ బద్దలు కొట్టింది. జగన్ సొంత జిల్లా కడపలో 39 జడ్పీటీసీ స్థానాలకుగాను 37స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. వీటిలో పోలింగ్‌కు ముం దే 23 ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన మరో 14 స్థానాలను కూటమి అభ్యర్థులు సొంతం చేసుకున్నారు.
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులోని చౌడేపల్లి, పులిచర్ల, రొంపిచర్ల, సోమల జడ్పీటీసీలను టీడీపీ కైవశం చేసుకుంది. సదుం జడ్పీటీసీ ఒక్కటి వైసీపీకి దక్కగా, పుంగనూరులో హోరాహోరీ పోరు నడుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జగన్ మేనత్త గ్రామం గణపవరంలో 20 ఏళ్ల తర్వాత టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గెలిచారు.

More Stories
నక్సల్స్ అంతం.. దిమాగీ నక్సల్స్ రాజకీయ పార్టీల్లో చొరబడ్డారు
ఎమర్జెన్సీని సమర్ధించుకొనే ప్రయత్నంలో సోనియా గ్రంధం
20 శాతం మించి ఇథనాల్..కర్ణాటక ఆరోపణను ఖండించిన కేంద్రం