“ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు, మీ ప్రతిపక్ష సీటు ఇప్పుడు ప్రమాదంలో ఉంది. రాబోయే కాలంలో, ప్రతిపక్ష సీటులో కూర్చోవడానికి కూడా ప్రజలు మిమ్మల్ని అర్హులుగా పరిగణించరు,” అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీలు అరాచకాన్ని వ్యాపింపజేస్తూ, దేశ రాజ్యాంగ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో జరిగిన ‘లోక్తంత్ర బచావో, అరాజకత హటావో’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అరాచకాన్ని తొలగించండి) ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ నిరసనల వెనుక ప్రతిపక్షాల అజెండా “కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడమే” అని ఆయన పేర్కొన్నారు. నగరంలో ‘పాదయాత్ర’కు నాయకత్వం వహించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన ఇండియా కూటమి తమ బూటకపు మాటలు, వాక్చాతుర్యంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ అధినేత ఆరోపించారు.
వారు తమ పద్ధతులను మార్చుకోకపోతే, ప్రజలు వారి ప్రస్తుత పదవిని కూడా కోల్పోయేలా చేస్తారని ఆయన హెచ్చరించారు. వారి ఉద్దేశాలు త్వరలోనే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ముందు బట్టబయలవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అబద్ధాలను ప్రచారం చేయడానికి ప్రయత్నించాయని, అయితే వారి దురుద్దేశాలు ఫలించవని బీజేపీ అధినేత పేర్కొన్నారు.
ఇండియా కూటమి ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపుతూ, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ ‘అబద్ధాలకోరుల’ ముఠా ఎటువంటి అభ్యంతరం చెప్పదని, కానీ ఘోర పరాజయం పాలైనప్పుడు మాత్రం, ఎన్నికల సంఘంతో సహా దేశంలోని రాజ్యాంగ సంస్థలను ప్రశ్నించడానికి, అపఖ్యాతి పాలు చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతుందని మండిపడ్డారు. వారి పాలనలో జరిగిన అనేక అవినీతి, కుంభకోణాలు, వరుస ఉగ్రదాడుల కారణంగానే వారు 2014 ఎన్నికలలో ఓడిపోయారని ఆయన పేర్కొన్నారు.
“మీరు రైతులను వదిలేశారు. యువత నిరాశాపూరిత వాతావరణంలో ఉండిపోయింది. ఈ సమస్యలే 2014లో మీ ఓటమికి దారితీశాయి. ఎన్నికల పరాజయం నుండి గుణపాఠం నేర్చుకోకుండా, మీరు ఈవీఎంలను నిందించడం ప్రారంభించారు,” అని నబిన్ పేర్కొన్నారు.

More Stories
ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాలే బలం..భిన్నత్వ పట్ల గౌరవం ఉండాలి
జేఎన్‌యూ నుండి కాంగ్రెస్ ఎంపీ అకోయిజామ్ తొలగింపుపై ఢిల్లీ హైకోర్టు స్టే
పుల్వామా ఉగ్రదాడితో పాక్ ఆర్థిక వ్యవస్థకు రూ 3.5 లక్షల కోట్ల నష్టం