లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ, ప్రొఫెసర్ అయిన అంగోంచా బిమోల్ అకోయిజామ్‌ను ఉద్యోగం నుండి తొలగిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వుపై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు తనకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని అకోయిజామ్ హైకోర్టుకు చెప్పడంతో, జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని ఈ మధ్యంతర ఉత్తర్వును జారీ చేశారు.
ఈ కేసు విచారణను జనవరి 2027కి వాయిదా వేశారు. అంతర్ మణిపూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్న అకోయిజామ్, గతంలో జేఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం, అక్టోబర్ 9న ఆయనను జేఎన్‌యూ నుంచి తక్షణమే తొలగించారు. పలువురు మహిళా విద్యార్థుల ఫిర్యాదుల మేరకు జేఎన్‌యూ అంతర్గత కమిటీ విచారణ జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
విచారణలోని అంశాల ఆధారంగా, కమిటీ ఒక పెద్ద శిక్షను సిఫార్సు చేసింది. ఆ తర్వాత జేఎన్‌యూ యాజమాన్యం అకోయిజామ్‌ను తొలగించింది. వైస్-ఛాన్సలర్ శాంతిశ్రీ డి. పండిట్ సంతకం చేసిన తొలగింపు ఉత్తర్వులో, విశ్వవిద్యాలయ అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ జరిపి, ఆ విచారణలో తేలిన అంశాల ఆధారంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.
“నిర్ణీత ప్రక్రియను అనుసరించి, అందుబాటులో ఉన్న అన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని, అంతర్గత కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, విశ్వవిద్యాలయ సేవల నుండి తొలగించే శిక్షను విధిస్తున్నాము” అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అకోయిజం అన్ని ఆరోపణలను ఖండించారు. విచారణ రాజకీయ ప్రేరేపితమని అభివర్ణించడంతో పాటు, ప్రక్రియాపరమైన లోపాలు ఉన్నాయని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఈ ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

More Stories
ప్రజాస్వామ్యం కాదు, ప్రమాదంలో మీ సొంత పదవి
ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాలే బలం..భిన్నత్వ పట్ల గౌరవం ఉండాలి
పుల్వామా ఉగ్రదాడితో పాక్ ఆర్థిక వ్యవస్థకు రూ 3.5 లక్షల కోట్ల నష్టం