ఆప్ కు మరో ఎమ్యెల్యే, మాజీ ఐపీఎస్ రాజీనామా 

2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ పంజాబ్ శాసనసభకు తక్షణమే రాజీనామా చేశారు. శాసనసభ్యుడిగా తాను నిర్దేశించుకున్న లక్ష్యాలలో 90 శాతం సాధించానని పేర్కొంటూ, ఈ మాజీ ఐపీఎస్ అధికారి తన నిర్ణయాన్ని ప్రకటించడానికి, తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు.
 
“రాజకీయాల్లోని ‘మై బాప్’ సంస్కృతికి ముగింపు పలికి, ప్రజలనే నా స్ఫూర్తిగా భావించి పనిచేయడమే నా అతిపెద్ద విజయం” అని ఆయన తెలిపారు. పంజాబ్‌ను మార్చడానికి సామూహిక కృషి చేయాలని పిలుపునిస్తూ, రాష్ట్రం మాదకద్రవ్యాలు, దోపిడీలు, గ్యాంగ్‌స్టరిజం, అవినీతితో పోరాడుతోందని, తన ప్రగతిశీల గుర్తింపును తిరిగి పొందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
తన భవిష్యత్ రాజకీయ ప్రయత్నాలు స్వచ్ఛమైన రాజకీయాలు, పారదర్శక పరిపాలనపై దృష్టి సారిస్తాయని పేర్కొంటూ, “నా ఏకైక లక్ష్యం ‘పంజాబ్ ఫస్ట్’. ఇది తప్ప, నాకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవు,” అని ఆయన చెప్పారు. కున్వర్ తన రాజీనామాను పంజాబ్ విధానసభ స్పీకర్‌కు సమర్పించారు. దీంతో 24 గంటలలోపే రాజీనామా చేసిన మూడవ ఆప్ శాసనసభ్యుడిగా ఆయన నిలిచారు. 
 
సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరమజ్రా, సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రాలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఆయన రాజీనామా వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా, చేతన్ సింగ్ జౌరమజ్రాలు రాజీనామా చేయడానికి ముందే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఆప్ అధికారికంగా ప్రకటించింది. 
 
 అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ ఆదివారం తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జౌరమజ్రా, పఠాన్‌మజ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో పార్టీ ఇటీవల హల్కా ఇన్‌చార్జ్‌లను నియమించడంతో, ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తిరిగి నామినేట్ చేయకపోవచ్చనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. 
 
మాజీ ఐపీఎస్ అధికారి అయిన కున్వర్ విజయ్ ప్రతాప్, పోలీసు సర్వీసుకు రాజీనామా చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆయన 2015లో ఫరీద్‌కోట్‌లో జరిగిన మత విద్వేష ఘటనలు, ఆ తర్వాత పంజాబ్‌లో జరిగిన పోలీసు కాల్పుల కేసుల దర్యాప్తుతో సంబంధం కలిగి ఉన్నారు. ఎమ్యెల్యేగా ఎన్నికైన తర్వాత పార్టీ నాయకత్వంతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. పార్టీ పనితీరుపైనా, మత విద్వేష కేసులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించిన తీరుపైనా ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. 

About The Author