ఐఏఎఫ్ చీఫ్‌గా ఎయిర్ మార్ష‌ల్ అశుతోష్ దీక్షిత్

భారత వైమానిక దళం చీఫ్‌గా ఎయిర్ చీఫ్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. 3,500 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఉన్న ఆయన 20 రకాల యుద్ధ విమానాలను నడిపారు. 2028 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. నలభై మూడేళ్ల సేవ అనంతరం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వైమానిక దళం నుంచి పదవీ విరమణ చేశారు. 

రేస్ కోర్స్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఆయనకు వైమానిక దళం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం దీక్షిత్‌కు బాధ్యతలు అప్పగించారు.  వ్యూహాత్మక ప్రణాళికల్లో పేరున్న దీక్షిత్ ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు వైమానిక దళం వైస్ చీఫ్‌గా పనిచేశారు. నాలుగు దశాబ్దాల సేవలో కమాండ్, స్టాఫ్, శిక్షణా బాధ్యతలు నిర్వహించారు. 

1966 డిసెంబర్ 9న జన్మించిన ఆయన 1986 డిసెంబర్ 6న వైమానిక దళంలోని ఫైటర్ విభాగంలో నియమితులయ్యారు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేశారు. అంతకుముందు సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బంగ్లాదేశ్‌లోని డిఫెన్స్ స్టాఫ్ సర్వీస్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజీల్లో విద్యాభ్యాసం చేశారు. 

మిరాజ్-2000, మిగ్ విమానాలు, కిరణ్, జాగ్వార్, ఐఎల్-78, హాక్, తేజస్ తదితర విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా, అర్హత కలిగిన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ సిందూర్‌తోపాటు పలు ఆపరేషన్లు, విన్యాసాల్లో పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంతంలోని ముందువరుస ఫైటర్ ఎయిర్ బేస్, దక్షిణ ప్రాంతంలోని ప్రముఖ ఫైటర్ శిక్షణా స్థావరానికి కమాండర్‌గా వ్యవహరించారు.  

About The Author