వీహెచ్‌పీ డిమాండ్‌తో వివాదాస్ప‌ద క‌విత తొల‌గించిన గుజరాత్ ప్రభుత్వం

గుజ‌రాత్ ప్ర‌భుత్వ స‌మాచార‌, ప్ర‌సార శాఖ ప్ర‌చురించే దీపావళి సందర్భంగా  ప్రచురించే వార్షిక  సాహిత్య పత్రిక  గుజ‌రాత్ దీపోత్స‌వీ అంక్ నుంచి ఓ వివాదాస్ప‌ద క‌విత‌ను తొల‌గించారు. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ క‌విత‌ను మార్చేశారు. శ్రీరాముడు, మీరాభాయ్ గురించి అభ్యంత‌ర‌క‌ర రీతిలో క‌విత్వం ఉన్న‌ట్లు వీహెచ్‌పీ ఆరోపించింది. క‌వి అజీజ్ తంక‌ర్వీ ఇందులో ‘ప్రేమ్‌ మా నా హోయ్ కైన్ ఏవీ షరత్’ (‘ప్రేమలో ఇటువంటి షరతులు ఉండకూడదు’) అనే క‌విత‌ను రాశారు.

ఆ వివాదాస్ప‌ద క‌విత స్థానంలో ప్ర‌కాశ్ జ‌లాల్ అనే క‌వి రాసిన జోయే అనే క‌విత‌ను ఆన్‌లైన్‌లో ప్ర‌చురించారు. ఇప్పటికే ప్రచురితమైన ఆ ప్రచురణకు చెందిన సుమారు 50 ప్రతులను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 21న ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆ పత్రికను ఆవిష్కరించారు. 

 
అజీజ్ రాసిన క‌విత‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని అక్టోబ‌ర్ 23వ తేదీన ముఖ్యమంత్రి భూపేంద్ర ప‌టేల్‌కు వీహెచ్‌పీ లేఖ రాసింది. ర‌చ‌యిత‌తో పాటు ఆ క‌విత‌ను ఆమోదించిన వ్య‌క్తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వీహెచ్‌పీ కోరింది. దానితో తంక‌ర్వీ క‌విత‌ను రీప్లేస్ చేసిన‌ట్లు గుజ‌రాత్ వీహెచ్‌పీ ప్ర‌తినిధి హితేంద్రసిన్హా రాజ్‌పుత్ తెలిపారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించి ఆ క‌విత‌ను తొల‌గించడం సంతోష‌క‌ర‌మ‌ని ఆయ‌న చెప్పారు.
ఈ ఏడాది ప్ర‌చురిత‌మైన వార్షిక మ్యాగ్జిన్‌కు చెందిన 389వ పేజీలో ఆ క‌వితను ప్రచురించినట్లు వీహెచ్‌పీ నేత అశ్వినీ ప‌టేల్ తెలిపారు.శ్రీరాముడు, మీరాభాయ్ గురించి త‌ప్పుగా రాసిన ఆ క‌విత‌ను ప్ర‌భుత్వ ప‌బ్లికేష‌న్‌లో జోడించ‌డం దారుణ‌మ‌ని వీహెచ్‌పీ పేర్కొన్న‌ది. 14 ఏళ్ల వ‌న‌వాసం త‌ర్వాత అయోధ్య‌కు తిరిగివ‌స్తున్న శ్రీరాముడి గురించి ఆ క‌విత‌లో అనుచితంగా రాసిన‌ట్లు తెలిసింది.

దేశం, మ‌తం, సంస్కృతి గురించి సంపూర్ణ అవ‌గాహ‌న ఉన్న ర‌చ‌యిత‌ల‌ను మాత్రమే ప్రోత్సహించాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. స‌మ‌చార‌, ప్ర‌సార శాఖ కార్య‌ద‌ర్శి విక్రాంత్ పాండే దీనిపై ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

About The Author