మహిళా వైద్యురాలిని నేలపై పడవేసి, దుస్తులు చింపేసిన దుండగుడు

పంజాబ్ లోని ఖరార్‌లోని సబ్-డివిజనల్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఒక వ్యక్తి, అక్కడ విధుల్లో ఉన్న మహిళా వైద్యురాలిపై దాడి చేశాడు. ఆమెను నేలపై పడవేసి, దుస్తులు చింపివేయడమే కాకుండా, ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేశాడు. సుమారు గంటపాటు కొనసాగిన ఈ గందరగోళం తర్వాత, ఆసుపత్రి సిబ్బంది ఎంతో శ్రమించి అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. 
 
ఆసుపత్రిలో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు లేవని వైద్యుల సంఘం ఆరోపించింది. నిందితుడిని ఖరార్‌లోని రామ్ బాగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న హీరా సింగ్ నగర్‌కు చెందిన రంజిత్‌పాల్ సింగ్‌గా గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం వంటి అభియోగాలపై అతడిని పోలీసులు అరెస్టు చేశారు.  బాధితురాలు (హర్మన్‌ప్రీత్ కౌర్) మొహాలీలోని ఏరోసిటీకి చెందినవారు. ఆమె రాత్రి 8 గంటల సమయంలో విధుల్లో ఉన్నప్పుడు, సదరు వ్యక్తి చికిత్స కోసం వచ్చాడు.
వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో, అతను ఏదో విషయమై ఆమెతో వాదనకు దిగాడు. ఆ తర్వాత ఆమె జుట్టు పట్టుకుని లాగి, దుస్తులను చింపివేశాడని ఆమె ఆరోపించారు.
“అక్కడ ఉన్న ఇతర సిబ్బంది అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, వారితో కూడా అతను గొడవకు దిగాడు. ఆ తర్వాత ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు. సిబ్బంది ఎంతో కష్టపడి అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు” అని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అక్టోబర్ 24న ఖరార్ సిటీ పోలీస్ స్టేషన్‌లో, భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని సెక్షన్లు 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 76 (మహిళను వస్త్రహీనురాలిని చేసే ఉద్దేశంతో ఆమెపై నేరపూరిత బలప్రయోగం), 132 (ప్రభుత్వ ఉద్యోగిపై దాడి), 221 (ప్రభుత్వ విధులను నిర్వహిస్తున్న ఉద్యోగికి ఆటంకం కలిగించడం), ‘ప్రభుత్వ ఆస్తి నష్ట నివారణ చట్టం’లోని సెక్షన్ 3-4 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పంజాబ్ సివిల్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “ఈ ఘటన జరిగిన సమయంలో ఖరార్‌లోని సబ్-డివిజనల్ ఆసుపత్రిలో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు లేవు. దుండగుడు మహిళా వైద్యురాలి జుట్టు పట్టుకుని, ఆమెను కొన్ని నిమిషాల పాటు నేలపై నొక్కి ఉంచాడు, ఆమె వస్తువులను పగలగొట్టాడు. దుస్తులను చింపివేశాడు” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
సబ్-డివిజనల్ ఆసుపత్రులలో 287 మంది భద్రతా సిబ్బందిని నియమించే ప్రతిపాదన తుది దశలో ఉందని, దీనిని ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సబ్-డివిజనల్ ఆసుపత్రులను కవర్ చేసే భద్రతా వ్యవస్థలో భాగంగా, రెండో దశను నవంబర్ 12లోపు అమలు చేయాలని ఆ సంఘం కోరింది.

About The Author