అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కు మధ్యప్రాచ్యంలో రెండు రహస్య బ్యాంకు ఖాతాలను ఉన్నాయని, అతని ఫోన్ను హ్యాక్ చేసిన రష్యన్ గూఢచారులు వాటిని బయటపెట్టారని ఆరోపణలు వచ్చాయి. ‘వానిటీ ఫెయిర్’ ప్రచురించిన ఒక సంచలనాత్మక కొత్త పుస్తక సారాంశం ప్రకారం, కుష్నర్ ఫోన్లోని స్క్రీన్షాట్లు రష్యా విదేశీ సైనిక గూఢచార సంస్థ నడుపుతున్న ఒక రిమోట్ సర్వర్లో కనుగొన్నారు.
అయితే, దీనిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు “నిరాధారమైన కల్పనలు” అని తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలు 2017 నాటివి. ఒక గూఢచర్య మిషన్ కోసం యూకేకు ప్రయాణిస్తున్నాడని తెలుసుకున్న డచ్ అధికారులు, జీఆర్యూకు చెందిన ఒక రష్యన్ గూఢచారిని అరెస్టు చేశారు. డచ్ వారు అతనికి రెండు అవకాశాలు ఇచ్చారు: నెదర్లాండ్స్ రక్షణ గూఢచార, భద్రతా సేవ కోసం పనిచేయడం, లేదా బ్రిటిష్ వారి చేతిలో అరెస్టు కావడం.
వానిటీ ఫెయిర్ ‘ఆల్ఫా’ అని పేరు పెట్టిన ఈ బ్యాంకు ఖాతా, యూఏఈలోని ఫస్ట్ అబుదాబి బ్యాంకులో ఉంది. దీనిని ఆ బ్యాంకు ఛైర్మన్, యూఏఈ పాలకుడు మొహమ్మద్ బిన్ జాయెద్ సోదరుడైన తహ్నూన్ బిన్ జాయెద్ పర్యవేక్షించారు. అమెరికా-మెక్సికోల మధ్య గోడ కట్టడం వంటి ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధాన లక్ష్యాలకు సహాయపడటానికి ఒక రహస్య నిధిని ఏర్పాటు చేయాలన్న బిన్ జాయెద్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆలోచన నుండి ఈ బ్యాంకు ఖాతా పుట్టింది.
ఆ రహస్య నిధి ఆలోచన చివరికి విఫలమైనప్పటికీ, ఈ ఇద్దరు మధ్యప్రాచ్య రాజవంశీకులు కుష్నర్ కోసం రెండు ఖాతాలలో కనీసం 2 బిలియన్ డాలర్లు జమ చేశారని ఆ పత్రిక నివేదించింది. వానిటీ ఫెయిర్ ప్రకారం, ‘బీటా’గా పిలవబడే మరో బ్యాంకు ఖాతాను యువరాజు కుష్నర్ కోసం 1 బిలియన్ డాలర్లు బదిలీ చేయడానికి ఉపయోగించారు. సౌదీ రాజవంశీకుడి వద్ద కుష్నర్ కోసం డబ్బు ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు తెలిసిందని, ఆ నిధులను ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యాంక్లో జమ చేయమని ట్రంప్ అల్లుడిని ఆయన ప్రోత్సహించారని ఒక మూలం చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
అజర్బైజాన్ ద్వారా దాదాపు 750 మిలియన్ డాలర్లు బదిలీ అయిన ఒక యుఏఈ ఆధారిత బ్యాంక్ ఖాతాను కుష్నర్ యాక్సెస్ చేసినట్లు నివేదిక ఆరోపించింది. ఈ ఖాతా ‘ఫస్ట్ అబుదాబి బ్యాంక్’లో ఉందని, ఇది యుఏఈ ప్రభుత్వ నిధులతో నడిచే ‘వతాని అల్ ఎమిరేట్స్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిందని పేర్కొంది. ఈ ఖాతా సాంకేతికంగా కుష్నర్ది కాకపోయినప్పటికీ, ఆయన దీనికి సంతకం చేసే అధికారం కలిగి ఉన్నారని రాసింది.
ఈ ఆరోపణలను తోసిపుచ్చిన కుష్నర్ వీటికి తగిన ఆధారాలు చూపాలని సవాలు విసిరారు. కాంగ్రెస్, స్పెషల్ కౌన్సెల్ సహా తాను తీవ్రమైన వచారణను ఎదుర్కొన్నానని, స్వచ్ఛందంగా 30 గంటలకు పైగా వాంగ్మూలం ఇచ్చానని కుష్నర్ గుర్తుచేశారు. ‘‘ఈ ఆరోపణలేవీ గతంలో ఎన్నడూ బయటకు రాలేదు.. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఏవీ నిజంగా జరగలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. వీటిని అభూత కల్పనలుగా కొట్టిపారేసిన కుష్నర్ ‘‘ఇది జర్నలిజం కాదు. తీవ్రంగా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి లేదా దురుద్దేశంతో వ్యవహరిస్తున్న వ్యక్తి రాసిన ఊహాజనిత సమాహారం” అని మండిపడ్డారు.

More Stories
2028 నాటికి భారతీయ బ్రాండ్ మొబైల్ ఫోన్లు
విచ్ఛిన్నకర శక్తులపై ఐక్య పోరాటానికి ప్రధాని మోదీ పిలుపు
అరుణాచల్ సరిహద్దుల్లో చైనాతో కొనసాగుతున్న ఘర్షణలు