సాధారణమైన సహజమైన రాజ్యాంగ విహితమైన పద్ధతిలో ప్రధాన మంత్రి మారటం సంభవిస్తే అది రెజీమ్ ఛేంజ్ కాదు అని కొందరు అభిప్రాయపడవచ్చు. పాలకపక్షం మారినా కూడా అది రెజీమ్ ఛేంజ్ కాదు. ఊహించని మార్పులు సంభవించి, సకాలంకాని వేళ సంభవించితేనే దానిని రెజీమ్ ఛేంజ్ అనాలని మరికొందరు వివరించవచ్చు. ఏది ఎలాగైనా అయిదేళ్లపాటు ఇప్పటి మంత్రివర్గపు పాలన (చెదరుమదరుగా జరిగే ఇద్దరు ముగ్గురు మంత్రుల మార్పులు లేదా రెండుమూడు శాఖల సర్దుబాట్లు పట్టించుకోనక్కరలేదు) సాఫీగా జరిగి పోతుంది అనుకొనే స్థితి నుండి అనుకోని కొన్ని పెద్ద మార్పులు జరగటం, ఆధికారం చేతులు మారటం రెజీమ్ ఛేంజ్ లో ప్రధానాంశం.
రాబోయే లోక్ సభ ఎన్నికలలో నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాతనే ఏదో ఒక భాషలోవాక్యాలు చదవటం మొదలు పెట్టినవారు సైతం వోటు వేయ బోతున్నారు. వారికి సోనియా, మన్మోహన్ సింగుల ద్వంద్వ పాలన ఎలా జరిగిందో తెలియదు. కామన్వెల్త్ ఆటల పోటీల పేరుతో ఎంత ధనం దుర్వినియోగమైందో, 2 జి స్పెక్ట్రమ్ వివాదమేమిటో, బొఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో గోల్ మాల్ ఏమిటో ఇవేవీ తెలిసి ఉండక పోవచ్చు.
చిన్న చిన్న నిత్యావసరాలకు సైతం (ఉదాహరణకు మునిసిపాలిటీ సరఫరాచేసే త్రాగునీటి కొరకు) పెద్ద పెద్ద ‘క్యూ’ లలో నిలబడ వలసి వచ్చేదనీ తెలియదు. విద్యుత్ సరఫరా 24 గంటలు అందుబాటులో ఉండే మంచిరోజుల గురించిఆనాటి ప్రజలు ఎంతగా ఎదురు చూసేవారో తెలిసి ఉండక పోవచ్చు. ఇటు వంటి వారు వోటర్ల జాబితాలో చేరి తాము ఊహించు కొనే కలల ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని వోటు వేసే సమయంలో వారి ప్రాధాన్యాల క్రమం ఎలా ఉంటుందో ఊహించుకోలేము.
వోటు వేసే నేపథ్యం కూడా ప్రముఖ పాత్ర వహించ వచ్చు. గతంలో ఒక్కొక్క ఇంటిలో నల్గురో ఐదుగురో ఓటర్లు ఉంటే ఎవరిష్టం వారిదే అయినా ఎంతో కొంత చర్చించుకొనేవారు. ఇప్పుడు ముగ్గురు వోటర్లు ఉండే ఇళ్లు ఎక్కడోగాని కనిపించవు. కాబట్టి వారి మనస్సులపై ప్రభావం చూపించే అంశాలలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇప్పుడున్న పాలకులకంటే మెరుగైన పాలన నిచ్చేవారు కావాలని కొందరైనా కోరుకోవటం ఆశ్చర్యం కలిగించదు. అయితే రంగంలో నిలిచి రకరకాలు ఆశలు కల్పిస్తూ వాగ్దానాలను గుప్పించే వారిని ఎంతవరకు నమ్మ వచ్చు? అనే విషయమై లోతుగా ఆలోచించేవారు ఎంద రుంటారో చెప్పలేము.
వోటర్ల బేస్ లో వచ్చే మార్పు, వారి ఆలోచనలలో ప్రాధాన్య క్రమాలలో మార్పు…. ఇలాంటి అంశాలు ప్రభావాన్ని చూపించి ఎంతో కొంత మార్పుకు దారి తీయటం ఖాయం. గతంలో 47-48 శాతానికి పరిమితమైన ఎన్డీఏ పక్షాల వోట్ల శాతం ఏ 60 శాతానికో చేరినా ఆశ్చర్య పోనక్కర లేదు. మిగిలిన వారు చూపిన ఆశలకు ఎక్కువమంది ప్రభావితులైతే ఏ 40-42 శాతానికో పరిమితమైనా ఆశ్చర్యం ఉండబోదు. ఎంతటి పూర్వజ్ఞాన సంపన్నులైన వోటర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారనేది ఇక్కడ కీలకాంశం కాబోతున్నది. ‘ది న్యూ ఇండియన్ ఎక్స ప్రెస్’ లో ప్రభు చావ్లా ఈ విషయమై పెద్ద వ్యాసం వ్రాశారు. అది చదవ దగినదిగా ఉంది.
ఇప్పటి పరిపాలకులను మార్చదలుచుకొంటే, అప్పుడు గద్దెనెక్కి పరిపాలించే వారు ఎలాంటి వారవుతారు?, వారు తమలో తాము ఎంతటి సమన్వయంతో వ్యవహ రించే వారుగా ఉంటారు?, ప్రజల సమస్యల పట్ల ఏపాటి శ్రద్ధ కల్గిన వారై ఉంటారు?… మొదలైన అంశాలను వారిచేత ఆలోచింపజేయవలసి ఉంది. కాగా నవతరం వారేకాక పాతతరం వారుకూడా ఆలోచించవలసిన ఒక అంశం ఉంది.
పాఠ్య పుస్తకాలలో ఉన్న పరిజ్ఞానాన్ని పుక్కిట పట్టటం వేరు, ఒక్కొక్క వ్యక్తితో పనిచేయించుకొంటూ ఎవరు ఎంతటి సమర్థులో గ్రహించుకొని ఎవరితో ఎలాంటి పనిని చేయించుకోవాలో తెలిసి వేగంగా పనిచేయించుకోగల సామర్థ్యం వేరు. ఒక వ్యక్తి ఎన్ని కోట్ల రూపాయలు క్రుమ్మరించినా అనుభవాన్ని బజారులోనుండి కొని తెచ్చుకో లేడు. పనిచేసిన అనుభవంలోనుండే అనుభవం లభిస్తుంది.
ఒక వ్యక్తి ప్రమాదకారి, పూర్తిగా చేష్టలుడిగిన వాడూ కానప్పుడు అనుభవజ్ఞుడైన వానిని వదులుకోకూడదు. ఇద్దరు అన్నదమ్ములు లేదా ఒకే గురువు వద్ద అవే పాఠాలను చదివిన ఇద్దరు శిష్యులూ ఉన్నారనుకుందాం. అలా ఆ ఇద్దరి హోదా ఇంచుమించు సమానమే అయినప్పటికీ వారిద్దరి అనుభవ పూర్వక జ్ఞానం సమానంగా ఉండదు. ఈ విషయంలో ఎవరైనాగాని నాతో విభేదిస్తారని నేను అనుకోను. చరిత్రలో గొప్ప పాలకులుగా పేరుతెచ్చుకొన్నవారందరూ దశాబ్దాల తరబడి పాలన సాగించినవారే. ఐదేళ్ళకొకసారి, లేదా అసహనంతో అంతకంటే తక్కువ కాలానికే పాలకుని మార్చిపారేసేటట్లయితే అనుభవ శూన్యులైన ఆ పాలకులనుండి ఆ ప్రజలు పొందగలిగేది చాలా పరిమితంగానే ఉంటుంది.
“అప్పుడప్పుడూ మనుషులను మారుస్తూ ఉండాలి. ఒకే మనిషి ఎక్కువ కాలం ఒక పనిచేస్తూ ఉంటే అది స్తబ్దతకు దారి తీస్తుంది. కాబట్టి క్రొత్త మనుషులు రావాలి, ప్రయోగాలు చేయాలి” అనే మాటలను వింటూ ఉంటాం. ఆ మాటలను వ్యతిరేకించవలసిన అవసరమూ లేదు. కాని ప్రయోగం చేస్తున్నామనే భ్రమలో పడి పెద్ద తలకాయ స్థానంలో ఎద్దు తలకాయను తెచ్చి పెట్టుకోకూడదు.
రంగంలో అందుబాటులో ఉన్నవారిలో ఎవరు ఏమిటి? వారి స్వభావం ఏమిటి? సామర్థ్యం ఏమిటి?, అనుభవం ఏమిటి? వారి మంత్రివర్గంలో ఉండబోయే వారు ఎలాంటి వారు. వారంతా ఒక జట్టుగా పొందికగా కలిసి నడిచే వారేనా? లేక ఒకరు ఇటు లాగితే మరొకరు అటు లాగే వారా? ఈ విషయాలన్నీ పరిశీలించుకొని బాధ్యతగా వోటు వేయడానికి వారిని సంసిద్ధ పరచవలసి ఉంది. ఈ లోపల అసహనంతో తొందరపాటుతో రెజీమ్ ఛేంజ్ ద్వారా స్వర్గంలోని అమృత భాండం ఒక్కసారిగా మన చేతిలో పడుతుందనే భ్రమలకు గురియై చేతులు కాల్చు కోరాదనీ నచ్చజెప్పవలసి ఉంది. ఇది వారి ఆలోచనా స్వేచ్ఛను హరించటంకాదు. సరైన మార్గంలో నడిచేటట్లుగా చూడటం, అందుకు ప్రోత్సహించటం మాత్రమే.

More Stories
చైనా ఏఐ సంస్థపై ప్రపంచ భద్రతా సంస్థల నిఘా
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు ‘త్వరలోనే’
అణు విద్యుత్ ఉత్పాదక దేశాల సరసన బంగ్లాదేశ్