* శిక్షపడిన ఉగ్రవాదుల పట్ల పక్షపాత వైఖరి.. బిజెపి కన్నెర్ర
1998 కోయంబత్తూరు వరుస పేలుళ్ల ఘటనలో పాత్ర పోషించినందుకు దోషులుగా తేలిన వారికి 60 రోజుల పెరోల్ మంజూరు చేయాలన్న టీవీకే ప్రభుత్వ నిర్ణయం పట్ల తమిళనాడు బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘దోషులుగా తేలిన ఉగ్రవాదుల పట్ల పక్షపాత వైఖరిని’ సూచిస్తోందని, ఇది మరణించిన వారికి అవమానమని, ప్రాణాలతో బయటపడిన వారికి ద్రోహమని మండిపడుతూ, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అది డిమాండ్ చేసింది.
బీజేపీ నాయకుడు ఎల్.కె. అద్వానీ ర్యాలీకి ముందు జరిగిన పేలుళ్లలో 58 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లను నడిపించినందుకు దోషులుగా తేలిన మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ అలీ, మోనప్ప అలియాస్ మహమ్మద్ హసన్, మహమ్మద్ అజమ్, నవాబ్ ఖాన్‌లకు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం 60 రోజుల జైలు విడుదలకు అనుమతి ఇచ్చింది. వీరికి నిషేధిత అల్-ఉమ్మా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి.
“రాష్ట్ర చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటిగా మిగిలిపోయిన ఒక ఉగ్రదాడి తీవ్రతను వ్యక్తిగత కారణాలు అధిగమించలేవు,” అని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణ్ తిరుపతి ఎక్స్ పోస్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని “తీవ్రంగా” ఖండించారు.
“ఎన్నికల ర్యాలీకి ముందు నిషేధిత అల్-ఉమ్మా ఉగ్రవాద సంస్థ జరిపిన ఈ పేలుళ్లు, పౌరులపై ఉద్దేశపూర్వకంగా చేసిన సామూహిక హత్యాయత్నం. సుప్రీంకోర్టు స్వయంగా ఈ నేరాన్ని ‘దారుణమైనది’గా అభివర్ణించి, దోషులకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది,” అని ఆయన గుర్తు చేశారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసిన బాంబులను అమర్చడంలో సహాయపడిన దోషులకు పెరోల్ మంజూరు చేయడం “చనిపోయిన వారికి అవమానం, బ్రతికున్న వారికి ద్రోహం” అని ఆయన ఆరోపించారు.
సమాజంపై యుద్ధం చేసే వారికి తేలికపాటి శిక్షలు లభిస్తాయని ఈ చర్య రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తోందని ఆయన చెప్పారు. “ఈ నిర్ణయం, శిక్షపడిన ఉగ్రవాదుల పట్ల పక్షపాత వైఖరిని స్పష్టంగా చూపిస్తోంది. 58 మంది బాధితుల జ్ఞాపకాలు, ప్రజల భద్రత దృష్ట్యా ఈ పెరోల్‌ను తక్షణమే రద్దు చేయాలి. 60 రోజుల పెరోల్ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ కేసులో అల్-ఉమ్మా దోషులకు ఇకపై ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని పట్టుబడుతోంది,” అని తిరుపతి స్పష్టం చేశారు.
“కోయంబత్తూరు బాధితులకు న్యాయాన్ని రాజకీయ లెక్కలతో బేరమాడలేము. ఉగ్రవాదులు తమ పూర్తి శిక్షను అనుభవించాలి,” అని ఆయన పేర్కొన్నారు. వరుస పేలుళ్ల కేసులో దోషిగా నిర్ధారించబడి, శిక్షకు వ్యతిరేకంగా అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా, కొంతమంది యావజ్జీవ కారాగార దోషులకు బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు అక్టోబర్ 4, 2023న ఇచ్చిన తీర్పును తిరుపతి ప్రస్తావించారు.

More Stories
మోదీ, షా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం శుభాకాంక్షలు
భారతదేశాన్ని ‘విచ్ఛిన్నం’ చేసే ప్రయత్నాలు సఫలం కావు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాలతో సంప్రదింపులు