తెలంగాణాలో గోదావరి పుష్కరాలకు రూ.900 కోట్లు

తెలంగాణలో 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్నాన ఘాట్లు, ఆలయాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. 2027 జూన్‌ 26 నుంచి జులై 7 వరకు పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. 
 
పనుల పరిశీలన, అంచనాల ఖరారు, వివిధ శాఖల మధ్య సమన్వయం, అభివృద్ధి పనుల పురోగతిని పర్యవేక్షించడం ఈ కార్యాలయం ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయి. పుష్కరాల ఏర్పాట్ల కోసం తొలుత సాంకేతిక కమిటీ, అధికారుల కమిటీలు కలిసి సుమారు రూ.6 వేల కోట్లతో ప్రాథమిక బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించాయి. అనంతరం సాంకేతిక కమిటీ రూ.1,819 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం శాశ్వత మౌలిక సదుపాయాల పనుల వ్యయాన్ని రూ.1,000 కోట్లకు పరిమితం చేయాలని సూచించింది. 
 
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత విభాగాల్లో అత్యవసరమైన పనులను గుర్తించి, వాటికి అనుగుణంగా అంచనాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో సుమారు రూ.900 కోట్ల విలువైన శాశ్వత పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించే ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. 
 
ఇందులో భాగంగా గూడెంగుట్టలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయం, పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తొలి ప్రాధాన్యత పనుల జాబితాలో గూడెంగుట్టతోపాటు చెన్నూరును కూడా చేర్చాలని భావిస్తోంది. ఆలయాల పరిసరాల్లో భక్తులకు అవసరమైన సదుపాయాలు, రాకపోకలకు అనువైన మార్గాలు, ఇతర మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టనున్నారు. 
 
పుష్కరాల నిర్వహణలో అత్యంత కీలకమైన స్నాన ఘాట్ల అభివృద్ధి కోసం ఎనిమిది జిల్లాల పరిధిలో 67 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. పనుల ప్రాధాన్యత ఆధారంగా వీటిని మూడు విభాగాలుగా వర్గీకరించింది. తొలి ప్రాధాన్యత కింద 11 ప్రాంతాలు, రెండో ప్రాధాన్యత కింద 13 ప్రాంతాలు, మూడో ప్రాధాన్యత కింద 43 ప్రాంతాలను చేర్చింది. 
 
తొలి జాబితాలో నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి, నిర్మల్‌ జిల్లా బాసర, గూడెంగుట్ట, మంచిర్యాల పట్టణం, చెన్నూరు, కోటిలింగాల, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, మంగపేట, భద్రాచలం ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాల వారీగా నిజామాబాద్‌లో 11, నిర్మల్‌లో 12, మంచిర్యాలలో 10, జగిత్యాలలో 19, పెద్దపల్లిలో 4, జయశంకర్‌ భూపాలపల్లిలో 1, ములుగులో 5, భద్రాద్రి కొత్తగూడెంలో 5 ప్రాంతాల్లో ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 

About The Author