భారతదేశాన్ని ‘విచ్ఛిన్నం’ చేసే ప్రయత్నాలు సఫలం కావు

భారతదేశాన్ని ‘విచ్ఛిన్నం’ చేసే ప్రయత్నాలు సఫలం కావని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన పరిస్థితులు మారుతాయని అనుకోవడం పొరపాటని, “ఇలా మునుపెన్నడూ జరగలేదు, ఇకపై జరగదు” అని ఆయన హెచ్చరించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ వార్షిక విజయదశమి వేడుకల్లో ప్రసంగిస్తూ  నిరసనల మధ్య, ఆందోళనలు మార్పును తీసుకురాలేవని, సమస్యలకు పరిష్కారాలు సమాజం నుంచే వస్తాయని  ఆయన పేర్కొన్నారు.
“భారతదేశమే వారి ప్రధాన లక్ష్యం, ఎందుకంటే భారతదేశం పురోగమిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా నిర్ణయాత్మక విధానాలతో భారతదేశం ముందుకు సాగిన తీరును తాము అడ్డుకోలేమని ఈ దుష్ట శక్తులకు తెలుసు… వారు భారతదేశాన్ని, సంఘ్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు,” అని పేర్కొంటూ నిరసనలు రాజకీయమైనవిగా లేదా రెచ్చగొట్టేవిగా ఉన్నప్పుడు అవి ఉద్రిక్తతలు, అరాచకం, ప్రజాశాంతికి భంగం కలిగిస్తాయని కూడా భగవత్ హెచ్చరించారు.
“గత కొన్ని దశాబ్దాలుగా భారత్ సరైన విధానం, సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు సాగుతోంది. నేటి భారతీయ యువతరంలో జాతీయ గర్వం, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నాయి. ఈ ‘ఆసురీ శక్తులకు’ (దుష్ట శక్తులకు) ఈ విషయం తెలుసు” అని తెలిపారు.  ప్రపంచ వేదికపై భారతదేశ వైవిధ్యాన్ని, పెరుగుతున్న స్థాయిని భగవత్ ప్రశంసించారు. “భారతదేశం, హిందువులు, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విశ్వాసం పెరుగుతోంది” అని ఆయన చెప్పారు.

భారతదేశం అభివృద్ధి చెందుతున్న మార్గం నుండి పక్కకు తప్పుకునేలా చేయాలని కోరుకునే శక్తులు ఉన్నాయని చెబుతూ భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. “ప్రపంచంలో భారత్ ఓడిపోవాలని కోరుకునే శక్తులు చాలా ఉన్నాయి… ఇది స్పష్టంగా కనిపిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్స్, అల్బేనియా, బంగ్లాదేశ్‌లలో నెలకొన్న అశాంతిని ప్రస్తావిస్తూ, ఆ ఆందోళనలు పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో ఉండాలని ఆయన సూచించారు. “ప్రతి రకమైన వ్యవస్థాగత ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉన్న పశ్చిమ దేశాల నుంచే ఈ తుఫాను చెలరేగింది” అని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి పేర్కొన్నారు.

 
“ఫ్రాన్స్, అల్బేనియా, నేపాల్ లేదా బంగ్లాదేశ్‌లలో ఏం జరిగిందో చూడండి. పాలన మారితే పరిస్థితి మారుతుందని వారు చెబుతుంటారు. కానీ, ఎక్కడా అలా జరగలేదు. తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకునేలా, తమకు అనుకూలమైన వ్యక్తులు (ఏజెంట్లు) అన్ని చోట్లా ప్రభావవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి చర్యలు జరుగుతుంటాయి. భారత్ శక్తివంతంగా ఎదిగినప్పుడు, ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట పడుతుంది” అని చెప్పారు. 
 
“సమస్యలు ఉంటాయి, ఆందోళనలు కూడా జరుగుతుంటాయి. కానీ, ఆందోళనలు పరిష్కారాల దిశగా ఉండాలి తప్ప, సమాజంలో ద్వేషాన్ని లేదా అశాంతిని పెంచేలా ఉండకూడదు. చౌకబారు ప్రచారం మన విచక్షణను, వివేకాన్ని మరుగున పరిచేలా అనుమతించకూడదు. కేవలం ఆందోళనల ద్వారా కాకుండా, సమాజం మొత్తం సమష్టిగా ఎదగడం ద్వారానే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి” అని ఆయన స్పష్టం చేశారు. 
 
వైవిధ్యాన్ని అంగీకరించి, గౌరవించే భావజాలం అవసరం 
 
“మనం విడిపోయి, బలహీనపడి, బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎందరో మహనీయుల వల్ల మనం ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందాం. మన భావోద్వేగ బంధాలను మనం మళ్లీ అర్థం చేసుకోవాలి” అని సంఘ్ 101వ జయంతి సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ తెలిపారు. మన దేశం ప్రకృతి, మతాలు, కులాలు, వంటకాలు మొదలైన వైవిధ్యాలతో నిండి ఉంది. కాబట్టి, వీటన్నింటినీ అంగీకరించి, గౌరవించే ఒక భావజాలం మనకు అవసరం అని చెప్పారు. 
 
మన సంప్రదాయం, మన సనాతన సంప్రదాయం ఈ ఆలోచనను స్వీకరిస్తుంది. అన్ని రకాల వైవిధ్యాలను స్వీకరించడం, ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడం మన నైజం అని, అది మన సంప్రదాయంలో పాతుకుపోయిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, వైవిధ్యం సహజంగానే గతిశీలమైనది కాబట్టి, మారుతున్న కాలంతో పాటు జీవితం కూడా పరిణామం చెందాలి; అయినప్పటికీ, శాశ్వత సూత్రాలను ఎల్లప్పుడూ పరిరక్షించుకోవాలి అని స్పష్టం చేశారు.
 
ఈ సౌలభ్యం మన సనాతన దృక్పథం ప్రత్యక్ష ఫలితం అని చెబుతూ ఒకరి సొంత భాష, సమాజం లేదా మతం పట్ల భావాలను కలిగి ఉండటం సహజమే అయినప్పటికీ, అంతకంటే ఉన్నతమైన, సర్వోన్నతమైన భావోద్వేగ ఐక్యత ఉంది—అదే భారతదేశ ఐక్యత అని డా. భగవత్ తెలిపారు. ఒకప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆవరించిన తత్వం కలిగిన ప్రజలమైన మనం, చివరికి మనమే విధించుకున్న నిర్బంధ సరిహద్దులచే పరిమితమయ్యామని విచారం వ్యక్తం చేశారు. 
 
“మన బలహీన స్థితిలో, మన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో, మనలో అహంభావం పెరిగింది—మనం గర్వపడ్డాము. మరి వీటన్నిటి పర్యవసానం ఏమిటి? మన దయనీయ దుస్థితి. సరైన ప్రవర్తనను విడిచిపెట్టి, మనం దుఃఖ స్థితిలోకి జారిపోయాము. మనం ఇప్పుడు మన నిజమైన ఉనికిని, గుర్తింపును గుర్తు చేసుకోవాలి; ఈ ప్రాథమిక భావోద్వేగ ఐక్యతను గుర్తుంచుకోవడం ద్వారా, మన సామూహిక శ్రేయస్సు కోసం మనం సంఘటితమై పరస్పర సహకారంతో జీవించాలి,” అని ఆయన పేర్కొన్నారు. 
 
శతజయంతిలో 10 కోట్లకు పైగా గ్రహాలకు సంఘ్ 
 
సంఘం శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా 10 కోట్ల కంటే ఎక్కువ గృహాలకు చేరువయ్యేలా చేపట్టిన విస్తృత ప్రజా సంపర్క కార్యక్రమం గురించి ఆయన వివరించారు. అదే సమయంలో, సోషల్ మీడియాను బాధ్యతారహితంగా ఉపయోగించడం పట్ల, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వ్యసనం పట్ల ఆయన హెచ్చరించారు. సంఘం శతజయంతి సందర్భంగా శాఖలను విస్తరించడానికి, స్వయంసేవకుల పరిధిని పెంచడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. 
 
ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం ఆ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి: ‘సంపర్క్ అభియాన్’ (గడప గడపకూ సంపర్కం) ద్వారా 4,61,527 గ్రామాలు, 41,076 బస్తీలలో (పట్టణ ప్రాంతాలు) మొత్తం 10,19,88,511 గృహాలను సంప్రదించడం జరిగింది. 1,117 జిల్లాల్లో ‘ప్రబుద్ధ నాగరిక్ గోష్ఠి’ (మేధావుల సమావేశాలు) నిర్వహించగా, ఇందులో 4,26,497 మంది ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. 5,036 ఖండ్‌లలో (తాలూకా స్థాయి) ‘సద్భావనా ​​బైఠక్‌లు’ (సౌహార్ద సమావేశాలు) జరిగాయి. 34,187 మండలాల్లో ‘హిందూ సమ్మేళనాలు’ నిర్వహించారు. అలాగే, ‘యువ సమ్మేళనాల’లో 39,25,225 మంది యువతీ యువకులు పాల్గొన్నారు.
సంత్ రవిదాస్,  స్వామి శ్రద్ధానందల శతజయంతి 
 
“మన దేశం విదేశీ దురాక్రమణదారుల దాడులతో అల్లాడుతున్నప్పుడు, ‘స్వధర్మం’ పాటించే వారిపై వారు భయోత్పాతం సృష్టిస్తున్నప్పుడు, భయానక వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, సంత్ రవిదాస్ ‘స్వధర్మ నిష్ఠ’, సాంఘిక సామరస్యం, భక్తి అనే సందేశాన్ని వ్యాప్తి చేశారని గుర్తు చేశారు.  ఆయన తన జీవిత ఉదాహరణతో ఆనాటి సమాజానికి ఓదార్పునిచ్చి, వారి గుణగణాలను నిలబెడుతూ వారి మనోధైర్యాన్ని పెంచారని ఆయన తెలిపారు. 
 
గత ఏడాది కాలంగా శతజయంతిని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహించారని, వాటి ముగింపు సందర్భంగా ఈరోజు విజయదశమిని జరుపుకోవడానికి మనమందరం ఇక్కడ సమావేశమయ్యామని భగవత్ తెలిపారు. 
 
“ఈ ఏడాది పూజ్యనీయ సంత్ రవిదాస్ జీ మహరాజ్ 650వ జయంతి సంవత్సరం. అణచివేతకు పాల్పడే విదేశీ ఆక్రమణదారుల పాలనలో భారతదేశం నలిగిపోతున్నప్పుడు, తమ సొంత మతాన్ని ఆచరించే ప్రజలు హింసకు గురవుతూ, దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్న కాలం అది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, సంత్ రవిదాస్ జీ ఎటువంటి భయం లేకుండా భక్తిని, సామాజిక సామరస్యాన్ని, ఆధ్యాత్మిక చింతనను ప్రచారం చేశారు. ఆయన తన జీవితం ద్వారా ఆ కాలంలోని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపారు; వారు తమ విలువలకు కట్టుబడి ఉంటూ, తమ గౌరవాన్ని కాపాడుకునేలా ప్రోత్సహించారు” అని ఆయన పేర్కొన్నారు. 
 
తమ మతాన్ని, సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేసిన ఇద్దరు గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం సముచితమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. “ఆర్య సమాజానికి చెందిన ప్రముఖ సన్యాసి, విద్యావేత్త, ‘శుద్ధి ఉద్యమ’కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి శ్రద్ధానంద జీ అమరత్వానికి ఇది శతజయంతి సంవత్సరం. అదేవిధంగా, స్వామి లక్ష్మణానంద సరస్వతీ మహరాజ్ శతజయంతిని కూడా జరుపుకుంటున్నాము. ఆయన ఒడిశాలోని గిరిజన సమాజాల సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు; వారిలో తమ మతం పట్ల అవగాహనను, దానిని కాపాడుకోవాలనే నిబద్ధతను పెంపొందించే పనిలో ఉండగా ఆయన అమరులయ్యారు” అని తెలిపారు. 
 
“ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సంవత్సరం ప్రారంభమైంది. అలాగే, బెంగాల్‌కు చెందిన శ్రీమద్ రాజనారాయణ బసు 200వ జయంతిని కూడా జరుపుకుంటున్నాము.” అని వివరించారు. “ఇటువంటి మహానీయులను స్మరించుకోవడం ఎంతో సందర్భోచితం. ఎందుకంటే, గత 100 ఏళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న కృషి కూడా ఇటువంటి జాతీయ అస్తిత్వ భావనను మేల్కొల్పే లక్ష్యంతోనే సాగుతోంది. భారతదేశ అస్తిత్వం, చరిత్రలో వేళ్లూనుకున్న ఈ ప్రయత్నం, దేశాన్ని సంఘటితం చేసి, దానిని శక్తివంతంగా, స్వయం సమృద్ధి కలిగినదిగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించింది” అని భగవత్ తెలిపారు. 
 
తొలుత ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌కు పుష్పాంజలి ఘటించి, గౌరవ వందనం  సమర్పించారు. సోమవారం నాడు, నాగ్‌పూర్‌లోని ధంతోలిలో ఉన్న ‘శ్రీ శ్రీ సార్వజనిక్ దుర్గా పూజ’ పండాల్‌లో భగవత్ ప్రార్థనలు చేశారు. మహా అష్టమి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులు దైవిక మాత (దుర్గా దేవి) ఆశీస్సులను కోరుకుంటారని, ఎందుకంటే ఈ ప్రపంచంలోని సమస్త కార్యకలాపాలు ఆమె అనుగ్రహంతోనే జరుగుతాయని పేర్కొన్నారు.

About The Author