ఏపీలో 12 మున్సిపాలిటీలలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం

* టీడీపీకి 10, జనసేన, బీజేపీలకు చెరొకటి
 
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కూటమి పార్టీలకు 12 చోట్ల ఏకగ్రీవం కానున్నాయి. కూటమి పార్టీల నుంచి మాత్రమే అభ్యర్థులు బరిలో నిలబడటంతో 12 చోట్ల ఏకగ్రీవం ఖాయమైనట్లే. టీడీపీ పోటీచేసిన కడప జిల్లా రాజంపేట, బద్వేలు, కమలాపురం; అన్నమయ్య జిల్లా రాయచోటి, పుంగనూరు; చిత్తూరు జిల్లా నగరి, అనంతపురం జిల్లా గుత్తి, పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల ఉంది. జనసేన ఖాతాలోకి ప్రకాశం జిల్లా దర్శి, బీజేపీ ఖాతాలోకి కడప జిల్లా ఎర్రగుంట్ల వెళ్లనున్నాయి. ఈ 12 చోట్ల ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 
వీటిలో సగం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోనే ఉన్నాయి. వీరిద్దరి కంచుకోటల్లో ఆరు పురపాలక, నగరపంచాయతీలను కూటమి కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు బరిలో లేకపోవటంతో పలు పురపాలికలు, నగర పంచాయతీల్లో ప్రత్యర్థులే లేని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకపోగా మరికొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేసినా నిబంధనల ఉల్లంఘనతో తిరస్కరణకు గురయ్యాయి. 
 
ఇంకొన్ని చోట్ల అభ్యర్థులు చివరి నిమిషంలో నామినేషన్‌ కేంద్రాలకు చేరుకున్నా గడువు ముగియడంతో అవకాశం కోల్పోయారు. దీంతో పలు స్థానాల్లో కూటమి అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. ఉపసంహరణల ప్రక్రియ అనంతరం ఏకగ్రీవ ఎన్నికలపై అధికారిక స్పష్టత రానుంది. రాజంపేట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్థానానికి నామినేషన్‌లలో కొన్ని సర్టిఫికెట్లు అందించకపోవడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. 
 
అక్కడ ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి దొంతం గాయత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్‌ తిరస్కరించడంతో, టీడీపీ అభ్యర్థితోపాటు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారు ఉపసంహరించుకుంటే అక్కడ కూడా ఏకగ్రీవమే. బద్వేలులో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంకట సాయికృష్ణ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో టీడీపీ అభ్యర్థి దివ్యతేజ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

కమలాపురం నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ ఛైర్‌పర్సన్, వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేయలేదు.. అక్కడ కేవలం టీడీపీ అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. ఎర్రగుంట్లలో వైసీపీ ఛైర్‌పర్సన్, వార్డులకు ఎవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో అక్కడ బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 

 
అన్నమయ్య జిల్లా రాయచోటి, పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నుంచి ఛైర్‌పర్సన్, వార్డులకు ఒక్క నామినేషనూ వేయలేదు. ఈ రెండు చోట్ల టీటీడీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మున్సిపాలిటీ.. గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలను కూటమి ఏకగ్రీవంకానున్నాయి.

దాచేపల్లిలో వైసీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ ఎన్నికల డిపాజిట్‌ రసీదు జత చేయకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో ఎవరూ నామినేషన్‌ వేయలేదు. టీడీపీ ఛైర్‌పర్సన్, 28 వార్డుల్లోనూ కూటమి పార్టీల అభ్యర్థులే మిగిలారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైసీపీ అభ్యర్థులెవరూ నామినేషన్‌ వేయలేదు. దీంతో పిడుగురాళ్లలో టీడీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి, 40 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులే రంగంలో ఉన్నారు.. కాబట్టి పిడుగురాళ్ల ఏకగ్రీవంకానుంది.

గురజాల నగర పంచాయతీలో వైసీపీ తరఫున ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఛైర్‌పర్సన్‌తోపాటు 23 వార్డుల్లోనూ కూటమి పార్టీల వార్డు సభ్యులే నామినేషన్లు వేయడంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవి టీడీపీకి ఏకగ్రీవంకానుంది. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీలో వైసీపీ తరఫున ఎవరూ నామినేషన్‌ వేయలేదు. అక్కడ జనసేన ఛైర్‌పర్సన్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. 

 
చిత్తూరు జిల్లా మున్సిపాలిటీ కూడా టీడీపీకి ఏకగ్రీవం కానుంది. ఛైర్‌పర్సన్‌ పదవికి 13 నామినేషన్లు దాఖలు చేయగా, టీడీపీ 3, వైసీపీ నుంచి 10మంది వేశారు. అయితే వైసీపీ అభ్యర్థుల నామినేషన్లలో లోపాలు ఉండటంతో అధికారులు తిరస్కరించారు. దీంతో టీడీపీ ఛైర్‌పర్సన్‌ మాత్రమే పోటీలో మిగిలారు.

About The Author