పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ యెమెన్‌లో భీకర దాడి జరిగింది. ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు సోమవారం షబ్వా ప్రావిన్స్‌లో ప్రభుత్వ భద్రతా దళాల సైనిక శిబిరంపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. ఈ ఘటనలో కనీసం 53 మంది సైనికులు మరణించారు. మరో 200 మందికిపైగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఈ వేసవిలో పోరాటం తీవ్రతరమైన తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇదొకటిగా నిలిచింది.
షబ్వా ప్రావిన్స్ రాజధాని అతాక్కు ఉత్తరాన ఉన్న జర్దాన్ జిల్లాలో ఇది ఉంది. ప్రభుత్వ నియంత్రణలోని మారిబ్ ప్రావిన్స్‌కు వెళ్లే మార్గంలో, ప్రభుత్వ దళాలకు కీలకమైన సరఫరా మార్గాల సమీపంలో ఈ శిబిరం ఉంది. దాడిలో లక్ష్యంగా చేసుకున్నవారు ‘రాపిడ్ ఇంటర్వెన్షన్’ పేరుతో ఇటీవల ఏర్పాటైన దళానికి చెందినవారని ఓ సైనికాధికారి తెలిపారు. ఆ ప్రాంతాన్ని రక్షించే బాధ్యత ఈ దళానికి అప్పగించారు.
ఈ దాడిని షబ్వా ప్రావిన్స్ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. షబ్వా భద్రతా సామర్థ్యాలను మరింత పెంచడానికి గగనతల రక్షణ వ్యవస్థలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలను షబ్వా ప్రావిన్స్ కోరింది. యెమెన్ రూలింగ్ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అధిపతి రషాద్ అల్- అలీమి ఈ దాడిపై తీవ్రంగా స్పందిస్తూ హూతీల దాడికి బదులు తీర్చుకుంటామని, హూతీ తిరుగుబాటుదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇరాన్ కుట్రలు ఎప్పుడైతే విఫలమవుతాయో అప్పుడే హూతీలు ఇలాంటి ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హూతీ రెబల్స్ కూడా శిక్షణ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అంగీకరించారు. మరోవంక, యెమెన్‌లోని హూతీల ఆధీనంలోని ఉత్తర సాదా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన వైమానిక దాడిలో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా కనీసం తొమ్మిది మంది మరణించినట్లు హూతీల ఆధీనంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

More Stories
ఆసియా పారా గేమ్స్ తొలి రోజే అథ్లెటిక్స్‌లో అదరగొట్టిన భారత్
ఇటలీలో దుకాణాల లూటీ.. ఆస్తుల ధ్వంసం
ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనల వెనుక ఓ భారతీయ సంస్థ!