తెలంగాణాలో 20-25 లక్షల ఎకరాల్లో ఎండిపోయిన పంటలు

* భట్టి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు 
 
తెలంగాణాలో కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో ఇప్పటికే సుమారు 20-25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేసినట్టు తెలిసింది. నదుల నీళ్లన్నీ కండ్లముందే సముద్రంలో కలుస్తున్నా వాటిని ఎత్తిపోయకుండా, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపకుండా ప్రభుత్వం మొండికేయడంతో పంట పొలాలు నెర్రెలు బారుతున్నాయి. దానికి తోడుగా ఎల్నినో ప్రభావం పెరగడంతో తెలంగాణలోని సాగునీటి చెరువులు పూర్తిగా ఎండిపోయి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
తీవ్ర వర్షాభావం, వర్షానికి వర్షానికి మధ్య సుదీర్ఘ అంతరం (డ్రైస్పెల్స్) ఉండటంతో ఈ ఏడాది ఖరీఫ్ పంటలను తలకిందులు చేశాయి. చెరువులు ఎండిపోవడంతో ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. అలాగే బోరుబావుల్లోనూ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఫలితంగా వీటిపై ఆధారపడి నాటిన వరి పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ప్రస్తుతం ఇదే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 
 
రాష్ట్రంలో ఈ వానాకాలంలో 17 శాతం వర్షపాతం లోటు నమోదైంది.  ప్రాథమిక సమాచారం ప్రకారం 331 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఆయనే స్వయంగా 13 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు తెలిపారు. కాది ఇది 16 లక్షల ఎకరాల వరకు ఉంటుందని వ్యవసాయశాఖ తేల్చింది. దీనికి తోడు మరో 4-5 లక్షల ఎకరాల్లో పత్తి పంట సైతం ఎండిపోయినట్టు తేల్చింది. ఇక మిగిలిన పంటలు కలిపి మరో 2 లక్షల ఎకరాల వరకు ఉంటుందని అంచనా వేసింది.
 
రాష్ట్రంలో కరవు, ఎల్‌నినో పరిస్థితులను సమీక్షించి, వాటి ప్రభావాలను అధిగమించేందుకు అవసరమైన చర్యలను సిఫార్సు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఈ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘంలో మంత్రులు ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిని సభ్యులుగా నియమించింది. 
 
ముఖ్యమంత్రి ప్రత్యేక ఆహ్వానితుడిగా సీనియర్‌ అధికారి కె. రామకృష్ణారావును నియమించగా, ప్రణాళిక శాఖ కార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఉపసంఘాన్ని ఆదేశించింది. కరవు, ఎల్‌నినో ప్రభావాలను అధిగమించేందుకు అవసరమైన చర్యలను గుర్తించి సిఫార్సులు సమర్పించాలని సూచించింది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాలపై కూడా సిఫార్సులు అందించాలని స్పష్టం చేసింది.
సాగునీరు లేక, అప్రకటిత విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. అవసరమైన నీరు అందకపోవడంతో పంట దిగుబడి తగ్గుతున్నది. ఈ ప్రభావంతో ఈ ఒక్క సీజన్‌లోనే రైతులకు భారీగా పంటనష్టం వాటిల్లుతున్నది. ఇప్పటి వరకు జరిగిన పంట నష్టం సుమారు రూ.20 వేల కోట్లు ఉంటుందని అంచనా. పరిస్థితి ఇలానే ఉంటే నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

నిరుటితో పోల్చితే ఈ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ముఖ్యంగా వరి సాగు భారీగా తగ్గింది. ప్రభుత్వం సీజన్‌ ముందు నుంచే వరి వేయొద్దని పిలుపునివ్వడంతో రైతులు దూరంగా ఉన్నారు. నిరుటితో పోల్చితే సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గడం గమనార్హం. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం ఈ సీజన్‌లో 1.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వీటిలో 56.79 లక్షల ఎకరాల్లో వరి, 48.33 లక్షల ఎకరాల్లో పత్తి, 5.93 లక్షల ఎకరాల్లో మక్క, 5.58 లక్షల ఎకరాల్లో కంది సాగయ్యాయి. 

గత ఏడాది 1.33 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా ఇందులో వరి 67.33 లక్షల ఎకరాలు, పత్తి 46 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నిరుటితో పోల్చితే ఈ సీజన్‌లో మొత్తం సాగు 7.39 లక్షల ఎకరాలు తగ్గింది. వరి 10 లక్షల ఎకరాలు తగ్గగా పత్తి మాత్రం 2.33 లక్షల ఎకరాల్లో పెరిగింది. ఇలా వరితో పాటు మొత్తం పంటల సాగు తగ్గించినా ప్రయోజనం లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు స్వయంగా కొంత మేర సాగు తగ్గిస్తే ఇప్పుడు కరెంట్‌, నీటి కరువుతో అదీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. 

ఉత్తర తెలంగాణలోని జిల్లాలతో పోలిస్తే, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కరవు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా నల్గొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అంతటా కరవు ఛాయలు అలముకున్నాయి. ఈ జిల్లాలో సాగునీటి చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఎండల ధాటికి వాగులు, వంకల్లో ఉన్న ఊట నీరు కూడా ఆవిరైపోతోంది.

About The Author