బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటాలో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు హరియాణా వాసులు కాగా, మరొకరు బిహార్ వాసి. ఈ ముగ్గురు రైలులో ప్రయాణిస్తుండగా కోటా నగర పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తేజస్విని గౌతమ్ మీడియాకు చెప్పారు. ఈ నిందితుల్లో మైనర్ కూడా ఉండడం గమనార్హం.
హరియాణాకు చెందిన రెహాన్ అలియాస్ సుక్కా, బిహార్‌కు చెందిన హృతిక్ కుర్మీ అలియాస్ రోషన్, ఒక మైనర్‌ను ముంబయి పోలీసులకు అప్పగించనున్నట్లు ఎస్పీ తేజస్విని గౌతమ్ తెలిపారు. ఈ ముగ్గురికి కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పుణె- జైపుర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా కోటా నగర పోలీసులు రైల్వే స్టేషన్‌లో ఈ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు ముగ్గురిలో ఇద్దరు డబ్బు తీసుకుని దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులు కాగా, మూడవ వ్యక్తి దాడి తర్వాత వారు తప్పించుకోవడానికి సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులలో ఒకరు హర్యానాలోని సోనిపట్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్. మిగిలిన ఇద్దరిని బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన 22 ఏళ్ల హృతిక్ కుమార్ అలియాస్ రోషన్ (ప్రస్తుతం ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో నివసిస్తూ ‘రాపిడో’ రైడర్‌గా పనిచేస్తున్నాడు), హర్యానాలోని సోనిపట్‌కు చెందిన 18 ఏళ్ల రెహాన్ అని గుర్తించారు.
రెహాన్ గత 12 ఏళ్లుగా తన తండ్రికి దూరంగా ఉంటున్నాడు. తొమ్మిదో తరగతిలో విఫలమైన తర్వాత, అతను చదువు మానేశాడు. గతంలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అతను జైలుకు కూడా వెళ్లాడు. అతని తల్లి, సంసిద, ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. రెహాన్ అత్త అఫ్సానా తెలిపిన వివరాల ప్రకారం, జైలు నుండి విడుదలైన తర్వాత రెహాన్ వెల్డింగ్ పని నేర్చుకున్నాడు.
తరచుగా పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లేవాడు. బక్రీద్ పండుగ సమయంలో అతను ఇంట్లోనే ఉన్నాడు, పండుగ జరుపుకున్న తర్వాత వెల్డింగ్ పనికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. రెహాన్ తన తల్లి, అత్తతో కలిసి తన మేనమామ ఇంట్లో నివసిస్తున్నాడు. కుటుంబ సభ్యులు పదేపదే వారించినా, అతడిని నేరపూరిత కార్యకలాపాల నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నించినా, అతను నేరాల్లో పాల్గొనడం కొనసాగించాడని తెలుస్తోంది.
ఎస్పీ గౌతమ్ తెలిపిన ప్రకారం, నిందితులు డిల్లీకి వెళ్లి అక్కడ్నుంచి నేపాల్‌కు పారిపోవాలని ప్రణాళిక వేసినట్లు చెప్పారు. ఉదయం 9:45 గంటల ప్రాంతంలో నిందితుల గురించి పోలీసులకు సమాచారం అందిందని, వారిని పట్టుకోవడానికి రైల్వే స్టేషన్‌లో పోలీసు బృందాలు గాలించాయని వెల్లడించారు. ట్రైనింగ్ పొందిన షూటర్లు బాలీవుడ్ హీరో హత్యకు ప్లాన్ చేసినట్లు ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది.
దాడికి ముందు హీరో టైగర్ ష్రాఫ్ కదలికలను రెక్కీ వేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వస్తాడని తెలిసే టైగర్‌పై దాడికి ప్లాన్ చేశారని అంచనా వేస్తున్నారు. జూహూలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ప్లాన్ ప్రకారం తప్పించుకున్నారు. ఎస్‌వీ రోడ్డు నుంచి విలే పార్లే, అంధేరీ మార్గంలో వెళ్లారు. అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద బైక్‌ను వదిలివెళ్లారు.
బోరివాలీ దిశగా వెళ్లే రైలు ఎక్కారు. నిందితులు ముగ్గురు తొలుతు మహారాష్ట్ర సరిహద్దును క్రాస్ చేశారని, ఆ తర్వాత పొరుగు రాష్ట్రం గుజరాత్‌లోకి ప్రవేశించారని, అక్కడ నుంచి రాజస్థాన్‌లోని కోటాకు వెళ్లినట్లు తెలుస్తోంది. తొలుత జూహూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు.

More Stories
ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనల వెనుక ఓ భారతీయ సంస్థ!
డీజిల్ అవసరాలకోసం భారత్ లో అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో
యువ విజేతలు చెప్పిన ఆర్ఎస్ఎస్ కధ