డిల్లీలో కొద్ది రోజులుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి) జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా, సర్ ప్రక్రియ వివాదంపై సీజేపీ సహా పలు ప్రతిపక్షాలు జరుపుతున్న ఆందోళనల పేరుతో రాజధానిలోని ప్రధాన మార్కెట్లను దిగ్బంధించి వ్యాపారాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నిరసనల పేరుతో వ్యాపారాల్ని దెబ్బతీయడం, కార్మికులకు రోజువారీ కూలీ అందకుండా చేయడం, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, చిన్నాచితకా వృత్తులపై ఆధారపడే వారి జీవనోపాధిని దెబ్బతీయడం వంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పండగల సీజన్లో ఈ పరిణామాలు వ్యాపారులు, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల ముసుగులో హిందూ పండగలపై అప్రకటిత నిషేధాన్ని విధించేలా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. భారతదేశ సంస్కృతిలో పండగలకు ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొంటూ మతపర, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఆర్థిక అభివృద్ధికి కూడా పండగలు దోహదపడతాయని తెలిపారు.
ప్రజల్లో సామరస్యం, సోదరభావం, ప్రేమను పెంపొందించడంలోనూ వాటి పాత్ర ఉందని చెబుతూ హిందూ పండగలు విదేశీ శక్తుల ప్రభావం, వాణిజ్య ప్రయోజనాలు వంటి అంశాలకు పదేపదే బలవుతున్నాయని బన్సల్ ఆరోపించారు. ఇక్కడ హిందూ వ్యాపారులే కాకుండా ఇతర వ్యాపారుల జీవనోపాధి కూడా దెబ్బతింటోందని, పండగల ఆనందం కూడా లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డిల్లీలో కన్నాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్, కరోల్ బాగ్, సదర్ బజార్ వంటివి బిజీ ప్రాంతాలని, దేశవ్యాప్తంగా వ్యాపారులు, కొనుగోలుదారులకు కీలక వాణిజ్య కేంద్రాలని వీహెచ్పీ ప్రతినిధి పేర్కొన్నారు. సాధారణంగా పండగల సమయంలో జనంతో కిటకిటలాడే ఈ మార్కెట్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో వ్యాపారులు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినప్పటికీ, నిరసనల కారణంగా ఇటీవల వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని బన్సల్ తెలిపారు.
ఈ ప్రధాన ప్రాంతాల్ని నిరసనలతో స్తంభింపజేసే ప్రయత్నాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని పేర్కొంటూ దానితో దేశ ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం పడుతుందని విమర్శించారు. నిరసనకారులు ఒకవైపు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం, అధికార యంత్రాంగం, భద్రతా బలగాలు, చివరకు సుప్రీం కోర్టును కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని బన్సల్ తీవ్ర ఆరోపణలు చేశారు.

More Stories
కోల్కతా దుర్గాపూజలో తొక్కిసలాట.. 19 మంది మృతి!
జమ్మూ కాశ్మీర్లో, ఇద్దరు అధికారులు, వేర్వేరు మార్గాలు
మాన్సా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకంపై ఎన్ఐఏ, ఈడీ విచారణ జరపాలి