అంబర్‌పేటలో 72 అడుగుల భారీ బతుకమ్మతో సరికొత్త రికార్డు!


​తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అంబర్‌పేటలో అట్టహాసంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గత రెండు దశాబ్దాలుగా ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రికార్డు స్థాయిలో ఏకంగా 72 అడుగుల భారీ బతుకమ్మను పేర్చి నిర్వాహకులు సరికొత్త చరిత్ర సృష్టించారు.

​ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పిల్లాపాపలతో, మహిళలు, పెద్దలు అనే తేడా లేకుండా వేలాదిగా తరలివచ్చిన జనసందోహం బతుకమ్మ ఆటపాటలతో అంబర్‌పేట ప్రాంతాన్ని పులకింపజేశారు. రంగురంగుల పూల సువాసనలు, సాంస్కృతిక కోలాహలం మధ్య తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది.

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పాల్గొంటూ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు ప్రతీక అని తెలిపారు. గునుగు, తంగేడు పూలను పేర్చి అందమైన బతుకమ్మను పేర్చి ప్రకృతిని ఆరాధిస్తుంటారని చెబుతూ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ పండుగ ప్రారంభమైందని ప్రాచీన కాలం నుంచి  నమ్మకం ఉందని తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో కూాడా బతుకమ్మ పండుగ విశిష్టత ఉండేదని చెబుతూ తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో కూడా బతుకమ్మ పండుగ ద్వారా ప్రజలందరినీ ఒకచోట చేర్చడానికి ఉపయోగపడిందని చెప్పారు.  “ఎంతస్థాయికి చేరుకున్నా కూడా మన మూలాలను మర్చిపోకూడదు. మన సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదీ” అని స్పష్టం చేశారు. 

“తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ.. ప్రకృతితో మమేకమై, ఆటపాటలతో సంబురాలు జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ పండుగను మనం మాత్రమే నిర్వహించుకుంటున్నాం. గ్రామగ్రామాల్లో ఈ వేడుకలను కనుల పండువగా జరుపుకుంటున్నాం” అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

“తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు.. మహిళలంతా కలిసి ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ. పూలను పేర్చి అందరూ కలిసి సామూహికంగా ఆడే సామాజిక పండుగే బతుకమ్మ” అని చెప్పారు. 

About The Author