ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో ‘తేనిసై తెండ్రల్’ (మధుర సంగీత సమీరం)గా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన దేవా సుదీర్ఘ ప్రస్థానంలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 400లకు పైగా చిత్రాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన అందించిన సంగీతం ఎంతో ప్రత్యేకం. మెగాస్టార్ చిరంజీవి ‘మాస్టర్’, పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ ‘తొలిప్రేమ’, రజనీకాంత్ సూపర్ హిట్ డబ్బింగ్ మూవీ ‘బాషా’, అలాగే ‘ఖుషి’ వంటి పలు విజయవంతమైన చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ముఖ్యంగా తమిళ జానపద ‘గానా’ సంగీత శైలిని వెండితెరకు పరిచయం చేసి, మాస్ బీట్స్‌తో ఆబాలగోపాలాన్ని అలరించడంలో ఆయనది అందె వేసిన చేయి. 
దేవా కుటుంబం విషయానికి వస్తే, ఆయన కుమారుడు శ్రీకాంత్ దేవా కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తుండగా, ఆయన సోదరులు సబేష్-మురళి కూడా మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు.  దేవా  అసలు పేరు దేవనేసన్ చొక్కలింగం. 1950 నవంబర్ 20న జన్మించిన ఆయన, 1980ల చివర్లో చిత్రసీమలోకి అడుగుపెట్టి 1990లలో తమిళనాట సంగీత సామ్రాజ్యాన్ని శాసించారు. ప్రత్యేకించి చెన్నై స్థానిక ‘గానా’ సంస్కృతిని, ఫోక్ బీట్స్‌ను మెయిన్‌స్ట్రీమ్ సినిమా సంగీతంలోకి తీసుకొచ్చి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు.
దాదాపు మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాలకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. తమిళనాడు ప్రభుత్వ ‘కలైమామణి’ పురస్కారంతో పాటు.. ‘ఆసై’ చిత్రానికి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా తమిళనాడు రాష్ట్ర అవార్డును అందుకున్నారు. జెేబీ కృష్ణ శిక్షణలో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. ఆయన విలక్షణమైన స్వరాలు, జానపద ఆధారిత స్వరకల్పనలు, ప్రధాన చిత్రాలలో గాన సంగీతానికి ప్రాచుర్యం కల్పించడంలో విశేష కృషి చేశారు. 1986లో వచ్చిన ‘మాట్టుకర మన్నారు’ సినిమాతోనే పరిశ్రమలో అరంగేట్రం చేశారు.   

About The Author