రాజ్యాంగ వ్యవస్థపై నిరంతరం దాడులతో కాంగ్రెస్ నాలుగో చారిత్రక తప్పిదం 

కాంగ్రెస్ పార్టీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలపై, రాజ్యాంగ వ్యవస్థపై నిరంతరం దాడులు చేయడం ద్వారా నాలుగవ చారిత్రక నేరానికి పాల్పడుతోందని  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. లక్నోలో మీడియాతో  మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో జరిగిన నాలుగు ప్రధాన చారిత్రక తప్పిదాలను “చీకటి అధ్యాయాలు”గా పేర్కొన్నారు. 
 
“కాంగ్రెస్ పాలనలో మూడు క్షమించరాని అతిపెద్ద నేరాలు జరిగాయని నేను భావిస్తున్నాను. మొదటిది, 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ). రెండవది, కాంగ్రెస్ అండతో 1984లో సిక్కు సోదరసోదరీమణులపై జరిగిన ఊచకోత. మూడవది, 1990లో రామభక్తులైన కరసేవకుల రక్తపుటేరులు పారించిన వారికి మద్దతునిచ్చి, వారి ప్రభుత్వాన్ని కాపాడటం,” అని సింగ్ పేర్కొన్నారు. 
 
“ఇక నాలుగవ నేరం ఏమిటంటే, నేడు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను, రాజ్యాంగబద్ధమైన సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. 1975లో ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని బంధీని చేశారని మీకు గుర్తు చేస్తున్నాను. నేడు రాహుల్ గాంధీ, రాజ్యాంగాన్ని తన జేబులో పెట్టుకుని అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ చరిత్రను తిరగేసి చూస్తే, ఇలాంటి అనేక చీకటి అధ్యాయాలు కనిపిస్తాయి,” అని ఆయన స్పష్టం చేశారు. 
 
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ “కృత్రిమ ఆగ్రహాన్ని” ప్రదర్శిస్తున్నారని, “అంతరాయం కలిగించే రాజకీయాలకు” పాల్పడుతున్నారని విమర్శించిన కేంద్ర మంత్రి, ఆయన ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలని, తన రాజకీయ ప్రవర్తనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. “రాజకీయ స్వార్థం కోసం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలి ఇవ్వకూడదు. ఈ వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోవాలి” అని స్పష్టం చేశారు. 
 
“.కృత్రిమ ఆగ్రహం, సంస్థలను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు, రాజకీయ అవకాశవాదం ద్వారా భారతదేశ అభివృద్ధి ప్రస్థానాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామనే పేరుతో ‘అంతరాయం కలిగించే రాజకీయాలు’ చేయడం మానేసి, రాహుల్ గాంధీ ప్రజల తీర్పును గౌరవించాలి. తన రాజకీయ పాత్రపై ఆత్మపరిశీలన చేసుకోవాలి—ఇదే నా సలహా,” అని సింగ్ హితవు చెప్పారు. 
 
అంతేకాకుండా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా యువతతో నిరసనలు చేయిస్తూ రాజకీయ అస్థిరతను సృష్టిస్తున్నాయని, బంగ్లాదేశ్‌లో జరిగినట్లుగానే భారతదేశంలో కూడా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు యువతను “అశాంతి రాజకీయాల్లో పావులుగా” మార్చడం ద్వారా దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఎన్నికల సంస్కరణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై జరుగుతున్న నిరసనలను అశాంతి సృష్టించి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇండియా బ్లాక్ ఒక సాకుగా వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశ రాజ్యాంగ సంస్థలను బలిపశువులను చేయలేమని హెచ్చరించారు.  
 
“గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు అనేక తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కాంగ్రెస్, దాని రాజకీయ మిత్రపక్షాలు, ప్రత్యక్షంగానూ, తమ అనుబంధ సంస్థల ద్వారా కూడా, యువత శక్తిని నిర్మాణాత్మక కార్యకలాపాలు, దేశ నిర్మాణం వైపు కాకుండా, రాజకీయ ఘర్షణలకు, గందరగోళ వ్యాప్తికి సాధనాలుగా మళ్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది” అని తెలిపారు. 

About The Author