రక్షణ ఒప్పందం ముడుపుల కేసులో ఆశిష్ క‌న్స‌ల్‌, అనిల్ కుమార్ అరెస్టు

మునిష‌న్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ అనిల్ కుమార్‌, ఆయ‌న సోద‌రుదు బీ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, ఎస్ఎంపీపీ లిమిటెడ్ సీఈవో ఆశిష్ క‌న్స‌ల్‌లను ఓ లంచం కేసులో సీబీఐ అరెస్టు చేసింది. అధికార లాభాల కోసం అక్ర‌మ రీతిలో ఒప్పందాలు కుదుర్చుకున్న‌ట్లు ఆ ముగ్గురిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ముగ్గుర్నీ మంగ‌ళ‌వారం అద‌పులోకి తీసుకున్నారు. అక్టోబ‌ర్ 12వ తేదీన కేసు బుక్ చేసినట్లు సీబీఐ చెప్పింది. 

మునిషన్స్ ఇండియా లిమిటెడ్ అనేది భారత సాయుధ దళాలకు అవసరమైన మందుగుండు సామగ్రి మరియు ఇతర ఉత్పత్తులను సరఫరా చేసే బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలలో ఒకటి. అటువంటి సంస్థకు చెందిన ఒక సీనియర్ అధికారికి సంబంధించిన లంచగొండితనం ఆరోపణలు, కొనుగోళ్ల సమగ్రత, పారదర్శకత మరియు అధికారిక అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఉన్న రక్షణల గురించి ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

పుణెలోని మునిష‌న్స్ ఇండియ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో అనిల్ కుమార్ ప్రైవేటు కాంట్రాక్ట‌ర్ల‌తో క్రిమిన‌ల్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అనిల్ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు త‌నిఖీ చేసి సుమారు 1.73 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. మైసూరు, బెంగుళూరు, ఢిల్లీల్లో కూడా సోదాలు చేప‌ట్టారు. అక్క‌డ సుమారు 50 ల‌క్ష‌ల న‌గ‌దుతో పాటు డాక్యుమెంట్లు సీజ్ చేశారు. 

త‌నిఖీల్ల దొరికిన మొత్తం న‌గ‌దు విలువ సుమారు 2.23 కోట్లుగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.  ఎస్ఎంపీపీ లిమిటెడ్ కంపెనీలో ఆశిష్ క‌న్స‌ల్ సీఈవోగా, డైర‌క్ట‌ర్‌గా చేస్తున్నారు. ఆ కంపెనీ డ్రోన్ టెక్నాల‌జీ, అమ్యునిష‌న్ ఉత్ప‌త్తిలో ఉన్న‌ది. క‌న్స‌ల్‌, అనిల్ మ‌ధ్య రెగ్యుల‌ర్ సంబంధాలు ఉన్నాయ‌ని, అమ్యునిష‌న్ స‌ర‌ఫ‌రా చేసేందుకు ఎస్ఎంపీపీ కంపెనీతో ఎంఐఎల్ 500 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలిసింది. 

ఎస్ఎంపీపీ ఉద్యోగి ర‌వి కుమార్ తివాతియా కూడా అనిల్‌తో ట‌చ్‌లో ఉన్నారు. ఆ ఒప్పందం ద్వారా వ‌చ్చిన లంచం అమౌంట్‌ను అనిల్ కుమార్ త‌న భార్య చేత‌న‌శ్రీ, సోదరుడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ద్వార ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడు. ఆశిష్ క‌న్స‌ల్ నుంచి అక్టోబ‌ర్ 12వ తేదీన పెద్ద మొత్తంలో అనిల్ కుమార్‌కు ముడుపులు ముట్టిన‌ట్లు ద‌ర్యాప్తులో గుర్తించారు. ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల‌కు చెందిన ప్ర‌భుత్వ సంస్థ‌లో కీల‌క‌మైన స్థాయిలో ఉన్న వ్య‌క్తికి, ప్రైవేటు కాంట్రాక్ట‌ర్ మ‌ధ్య అక్ర‌మ డీల్ కుదిరిన‌ట్లు తేల్చారు. బీఎన్ఎస్‌లోని సెక్ష‌న్ 61(2), లంచం చ‌ట్టంలోని సెక్ష‌న్ 7,8,9, 12 కింద అనిల్ కుమార్‌, ఆశిష్ క‌న్స‌ల్‌, రావిత్ కుమార్ తివాతియా, హ‌ర్ష‌వ‌ర్ద‌న్, చేత‌న‌శ్రీపై కేసు బుక్ చేశారు.

About The Author