బ్రిటన్‌లోనూ భారతీయ విద్యార్థుల అడ్మిషన్లకు కత్తెర!

విదేశీ విద్యార్థులను చేర్చుకునే యూనివర్సిటీలపై బ్రిటన్‌ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో కొన్ని యూనివర్సిటీలు గతంలో ఇచ్చిన అడ్మిషన్‌ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకుంటున్నాయి. వీసా అప్లికేషన్లు రిజెక్ట్‌ అయితే తమ సంస్థలపై ఆంక్షలు పడే అవకాశం ఉండటంతో వీసా నిర్ణయం రాకముందే విద్యార్థుల అడ్మిషన్‌ ప్రాసెస్‌ను ఆపేస్తున్నాయి. 

పలు యూనివ‌ర్సిటీలు తీసుకుంటున్న ఈ నిర్ణయం భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్, నైజీరియాకు చెందిన విద్యార్థులపై కూడా ప్రభావం చూపుతోంది. విదేశీ విద్యార్థులకు స్పాన్సర్‌గా ఉండే బ్రిటన్‌ యూనివర్సిటీలపై ప్రభుత్వం బేసిక్‌ కంప్లయన్స్‌ అసెస్‌మెంట్‌ (బీసీఏ) రూల్స్‌ను కఠినతరం చేసింది. 

2026 జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం ప్రకారం యూనివర్సిటీలు తమ స్టూడెంట్‌ వీసా అప్లికేషన్ల రిజెక్షన్‌ రేటును 5 శాతం కంటే తక్కువగా ఉంచాలి. గతంలో ఈ పరిమితి 10 శాతంగా ఉండేది.  అలాగే, యూనివర్సిటీలు స్పాన్సర్‌ చేసిన విద్యార్థుల్లో కనీసం 95 శాతం మంది తమ కోర్సుల్లో జాయిన్‌ కావాలి. గతంలో ఈ రూల్‌ 90 శాతంగా ఉండేది. 

కోర్సులను పూర్తి చేసే విద్యార్థులకు సంబంధించిన ప్రమాణం మాత్రం 2026 జూన్‌ నుంచి జరిగే మదింపుల్లో 85 శాతంగానే ఉంటుంది. 2027 జూన్‌ నుంచి దీన్ని 90 శాతానికి పెంచనున్నారు.  విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పర్యవేక్షించడం, వీసా రూల్స్‌ దుర్వినియోగాన్ని అరికట్టడం, కోర్సుల్లో చేరకుండా ఉండటం లేదా మధ్యలోనే చదువు ఆపేసే విద్యార్థుల సంఖ్యను తగ్గించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం అని బ్రిటన్‌ హోం శాఖ తెలిపింది.

బ్రిటన్‌ హోం శాఖ గణాంకాల ప్రకారం 2026 జనవరి–జూన్‌ మధ్య యూకే స్టడీ వీసా అప్లికేషన్లలో 10.5 శాతం ఉపసంహరించుకున్నారు. 2025లో ఇదే కాలానికి ఈ రేటు 2.3 శాతంగా ఉండగా 2023లో కేవలం 0.4 శాతమే నమోదైంది. అంటే గతంతో పోలిస్తే వీసా అప్లికేషన్ల ఉపసంహరణలు బాగా పెరిగాయి.

దేశాలవారీగా చూస్తే పాకిస్థాన్‌ విద్యార్థుల అప్లికేషన్ల ఉపసంహరణ రేటు 2025 తొలి ఆరు నెలల్లో 3 శాతంగా ఉండగా, 2026లో ఏకంగా 40.9 శాతానికి చేరింది. బంగ్లాదేశ్‌ విద్యార్థుల్లో ఈ రేటు 23.5 శాతంగా, నైజీరియా విద్యార్థుల్లో 22.7 శాతంగా నమోదైంది. భారతీయ విద్యార్థుల విషయంలోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. 2025 తొలి ఆరు నెలల్లో 1.2 శాతంగా ఉన్న ఉపసంహరణ రేటు 2026లో 5.2 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలు యూకేలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు వీసా ప్రక్రియ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

About The Author