అమెరికాలో వలసదారులకు 540 రోజుల వెసులుబాటుకు గండి 

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వలసదారులకు వర్క్‌ పర్మిట్‌ గడువు ముగిసినా, పునరుద్ధరణ దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన గరిష్ఠంగా 540 రోజులపాటు పని కొనసాగించేందుకు గతంలో కొన్ని కేటగిరీలకు అందుబాటులో ఉన్న ఆటోమేటిక్‌ పొడిగింపునకు అమెరికా ప్రభుత్వం ముగింపు పలికింది. 2025 అక్టోబర్‌ 30న అమల్లోకి వచ్చిన ఈ మార్పును తాజాగా తుది నిబంధనగా ఖరారు చేసింది.
 
2026 అక్టోబర్‌ 14 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో వర్క్‌ పర్మిట్‌ పునరుద్ధరణలో జాప్యం ఎదుర్కొనే అర్హులైన వలస ఉద్యోగులకు పని కొనసాగింపుపై అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాదారుల అర్హులైన జీవిత భాగస్వాములు సహా కొన్ని వర్గాలపై దీని ప్రభావం పడనుంది. అయితే ఈ నిర్ణయం అమెరికాలోని  వలసదారులందరి వీసాలను రద్దు చేసేది కాదు. ఇది నిర్దిష్ట కేటగిరీల ఉద్యోగ అనుమతుల ఆటోమేటిక్‌ పొడిగింపునకు సంబంధించిన మార్పు మాత్రమే..

హెచ్‌-4 వీసాదారులు: అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాముల్లో అర్హత ఆధారంగా ఈఏడి పొందిన కొందరికి ఈ మార్పు ముఖ్యమైనది. పర్మిట్‌ గడువు ముగిసిన తర్వాత పునరుద్ధరణ ఆమోదం ఆలస్యమైతే, కొత్త అనుమతి వచ్చే వరకు ఉద్యోగాన్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబ ఆదాయంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ మార్పుతో ప్రతి వలస ఉద్యోగి వెంటనే ఉద్యోగం కోల్పోతారని చెప్పలేం. అయితే ఆటోమేటిక్‌ పొడిగింపునకు అర్హత లేని పునరుద్ధరణ దరఖాస్తుదారులు తమ ప్రస్తుత పర్మిట్‌ గడువు ముగిసిన తర్వాత కొత్త అనుమతి పొందే వరకు పని కొనసాగించలేకపోవచ్చు. దరఖాస్తు సమర్పించిన రసీదు ఒక్కటే పని చేయడానికి అనుమతిగా పరిగణించబడదు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు తమ పని అనుమతి గడువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పర్మిట్‌ ముగిసే తేదీని ముందుగానే గుర్తించి, పునరుద్ధరణకు అర్హత వచ్చిన వెంటనే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడం మంచిది. దరఖాస్తు పెండింగ్‌లో ఉందనే కారణంతో పని కొనసాగించవచ్చని భావించకూడదు.

About The Author