అధికారం కోసం అరాచకాన్ని సృష్టిస్తున్న కాంగ్రెస్

అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అరాచకాన్ని సృష్టిస్తోందని, రాజ్యాంగబద్ధమైన సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకవాదుల సమూహమని, వీధి పోరాటాల ద్వారా గందరగోళాన్ని సృష్టించి వ్యవస్థను వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.
 
“ఆ పార్టీ ఇప్పుడు విదేశీ శక్తుల చేతిలో పావుగా మారింది. అధికారం కోసం వారు ఎప్పుడూ బాంబు తయారీదారులు, బొద్దింకలు, జార్జ్ సోరోస్ వంటి దేశ వ్యతిరేక శక్తులు లేదా స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడుతుంటారు,” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. “గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధమైన సంస్థలపై నిరంతరం దాడులు చేస్తోంది. ఎన్నికల్లో ఓటమికి రాజ్యాంగ సంస్థలను నిందించడం ఆ పార్టీకి ఒక అలవాటుగా మారింది” అని విమర్శించారు. 
 
వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత నిరసనలు చేపట్టడం, సమస్యలను వీధుల్లోకి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. దీనికి కారణం ఎన్నికల సంఘం కాదు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న దిశానిర్దేశం లేని నాయకత్వమే అని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో నిరంతరం అంతర్గత పోరు సాగుతోందని, పంజాబ్‌లో రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాల్సి వచ్చిందని, అలాగే అనేక చోట్ల నాయకత్వ పరమైన అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని చౌహన్ వివరించారు . 
 
దేశం గురించి, ప్రజల గురించి ఏమాత్రం అవగాహన లేని నాయకత్వం కాంగ్రెస్‌ది అని సింగ్ స్పష్టం చేశారు. ఒడిశాలో 26 ఏళ్లు, నాగాలాండ్‌లో 23 ఏళ్లు, గోవాలో 15 ఏళ్లు, ఢిల్లీలో 13 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉందని, మూడు నాలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన చోట్ల అది కేవలం ఒక చిన్న భాగస్వామి స్థాయికి పడిపోయిందని చౌహాన్ పేర్కొన్నారు.
 
“తమిళనాడులో డీఎంకేపై, బీహార్‌లో ఆర్జేడీపై, ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ లేదా బీఎస్పీ పై, జార్ఖండ్‌లో జేఎంఎంపై, జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌పై ఆ పార్టీ ఆధారపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న భాగస్వామిగా, నామమాత్రపు శక్తిగా మిగిలిపోయింది,” అని ఆయన జోడించారు.

About The Author