ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు బ్రేక్

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు, ఆందోళనల నిర్వహణకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నిరసనలకు గుర్తించిన జంతర్ మంతర్‌ను ఆ జాబితా నుంచి తొలగించి, ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాలను ఎంపిక చేశారు.  కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఢిల్లీలో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి మూడు కొత్త ప్రాంతాలను ప్రదర్శన వేదికలుగా ఖరారు చేశారు.
అత్యంత భద్రత కలిగిన సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఉంటూ, ఇప్పటివరకు ప్రధాన నిరసన వేదికగా ఉన్న జంతర్ మంతర్‌ను ఇకపై ప్రదర్శనల కోసం ఉపయోగించరు. అక్టోబర్ 11, 2026న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాత ఢిల్లీలోని రాంలీలా మైదాన్, తూర్పు ఢిల్లీలోని సిబిడి గ్రౌండ్, ఉత్తర ఢిల్లీలోని బురారీ గ్రౌండ్‌లను నిరసన వేదికలుగా గుర్తించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ సంతకం చేసిన ఉత్తర్వులు, 2022 ఏప్రిల్ 28న జారీ చేసిన పాత ఆదేశాలను పాక్షికంగా సవరిస్తున్నాయి. 
 
‘‘ హోం శాఖ పరిధిలోని ఓ కమిటీ సిఫార్సుల మేరకు జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా డి-నోటిఫై చేశాం. ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించడానికి రామ్‌లీలా మైదానం, బూరారీ మైదానం మరియు తూర్పు ఢిల్లీలోని సిబిడి మైదానాలను కొత్త వేదికలుగా కేటాయించాం’’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మూడు కొత్త ప్రాంతాల్లో నిరసనలు చేపట్టేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను త్వరలోనే విడిగా విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.
 
నిరసనకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించగల ప్రత్యామ్నాయ వేదికను గుర్తించాలని సుప్రీంకోర్టు కేంద్ర, ఢిల్లీ అధికారులను కోరిన కొద్ది రోజులకే ఈ మార్పు చోటుచేసుకుంది. అక్టోబర్ 9న జరిగిన విచారణలో, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తులు జయమల్య బాగ్చీ, వి. మోహనలతో కలిసి, జంతర్ మంతర్ వద్ద దశాబ్దాలుగా ఉన్న ఏర్పాటును పునరాలోచించాలని పిలుపునిచ్చింది. 
 
ప్రత్యామ్నాయ ప్రదేశంలో తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సౌకర్యాలు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలతో సహా ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. ఆ వేదిక ప్రజా భద్రత, అత్యవసర సేవల లభ్యత, ఇతర నివాసితుల ప్రయోజనాలను కాపాడుతూనే, పౌరులు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోవడానికి వీలు కల్పించాలని కూడా అది నొక్కి చెప్పింది.
 
 “మీరు మెరుగైన సౌకర్యాలు కూడా కల్పించగల ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎందుకు కనుగొనకూడదు?” అని కేంద్రం, ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు పరిశీలనలను సంబంధిత అధికారులకు తెలియజేస్తానని మెహతా తెలిపారు.

About The Author