గుజరాత్‌లోని రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు దోమల ముప్పును తప్పించేందుకు అత్యంత ఆధునిక సాంకేతికత టెక్నాలజీ రంగంలోకి దించింది. ఆకాశం నుంచి నిఘా పెట్టే డ్రోన్లు, పరిస్థితిని అంచనా వేసే ఏఐ కలయికతో నగరంలోని దోమల స్థావరాలపై వినూత్న యుద్ధం ప్రకటిస్తోంది.
మనుషులు వెళ్లలేని మురుగు కాల్వలు, బురద గుంతలు, పొదలతో నిండిన నదీ పరివాహక ప్రాంతాల్లో దాగి ఉన్న దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించడం సాధారణంగా చాలా కష్టం. కానీ రాజ్‌కోట్ అధికారులు ఊరుకోలేదు. 95.27 చదరపు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను గాల్లోకి లేపి జల్లెడ పట్టారు. ఏఐ సాయంతో ఏకంగా 10,333 అనుమానాస్పద ప్రాంతాలను పిన్ పాయింట్‌గా గుర్తించారు.
కేవలం స్థావరాలను గుర్తించడమే కాదు, వెంటనే యాక్షన్ ప్లాన్ అమల్లోకి తెచ్చారు. గుర్తించిన 10,333 ప్రాంతాల్లో ఇప్పటికే 5,605 చోట్ల నివారణ చర్యలు పూర్తయ్యాయి. గాల్లో నుంచే డ్రోన్ల ద్వారా ఏకంగా 149 గంటల పాటు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసి లార్వాను మట్టుబెట్టారు. ఒకవైపు గాల్లో డ్రోన్లు సర్వే చేస్తుంటే, మరోవైపు నేలపైన హెల్త్ వారియర్స్ రంగంలోకి దిగారు.
అక్టోబర్ 1 నుంచి 7 మధ్య ఏకంగా 1,03,359 ఇళ్లను ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తనిఖీ చేసి లార్వాను నాశనం చేశారు. స్కూళ్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, స్క్రాప్ యార్డులు సహా 303 వాణిజ్య ప్రదేశాల్లో సర్ప్రైజ్ రైడ్స్ నిర్వహించారు. దోమల పెరుగుదలకు కారణమైన 260 నివాసాలకు, 37 వ్యాపార సంస్థలకు నోటీసులు జారీ చేసి ఫైన్లు గుంజారు. కేవలం దోమలకే పరిమితం కాకుండా నీటి ద్వారా వచ్చే వ్యాధులపైనా అధికారులు దృష్టి సారించారు.
2.47 లక్షల మంది జనాభాపై సర్వే చేసి వేల సంఖ్యలో క్లోరిన్ మాత్రలు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రతీ ఇంట్లో కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మైకుల ద్వారా మైండ్ బ్లోయింగ్ అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. సాంకేతికతను సరిగ్గా వాడుకుంటే ఎలాంటి సమస్యనైనా చిత్తు చేయొచ్చని రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ నిరూపిస్తోంది. హైటెక్ పద్ధతిలో సాగుతున్న ఈ ‘యాంటి-మస్కిటో డ్రైవ్’ ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది.

More Stories
ఢిల్లీలో మెట్రో రైళ్లు నడపండి.. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించండి
మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి
ఫ్లైదుబాయ్ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు