చెన్నై మెట్రో రెండో దశను ప్రారంభించిన ప్రధాని మోదీ

* సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం

చెన్నై మెట్రో రెండో దశలో భాగంగా పూనమల్లి నుంచి వడపళని వరకు ఉన్న 15 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్‌తో కలిసి ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించారు. తమిళనాడు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో ప్రధాని మోదీ, సీఎం విజయ్‌ కలిసి కొత్త మెట్రో సేవలను ప్రారంభించారు. 2014లో 5 నగరాలకే పరిమితమైన మెట్రో రైలు సేవలు ఇప్పుడు 25 నగరాలకు విస్తరించాయని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. . కారిడార్ 4లో భాగంగా సుమారు రూ.4,900 కోట్ల వ్యయంతో ఈ కొత్త మార్గాన్ని నిర్మించారు. 15 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో మొత్తం 11 ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. ముఖ్యంగా కొన్నిచోట్ల డబుల్ డెక్కర్ సెక్షన్‌ను నిర్మించడం ఈ మార్గం ప్రత్యేకత.  అంతేకాకుండా భవిష్యత్తులో డ్రైవర్ అవసరం లేకుండానే రైళ్లను నడిపేందుకు వీలుగా ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇది రైళ్ల రాకపోకలలో కచ్చితత్వాన్ని, భద్రతను పెంచుతుంది.

ఈ కొత్త మెట్రో కారిడార్ అందుబాటులోకి రావడంతో చెన్నై పశ్చిమ శివారు ప్రాంతాలైన పూనమల్లి వంటి ఏరియాల నుంచి వడపళని వంటి నగర కేంద్ర ప్రాంతాలకు ప్రయాణం సులభతరం కానుంది. ఈ సందర్భంగా మెట్రో టికెట్ కొనుగోలు చేసిన ప్రధాని  టికెట్ కౌంటర్లోని ఉద్యోగితో కాసేపు మాట్లాడారు. చెన్నై మెట్రో తొలి దశ పనులు 2009లో ప్రారంభంగా, 2015లో మెట్రో సేవలను మొదలుపెట్టారు. తొలి దశ 54.1 కిలోమీటర్ల పూర్తి మార్గం 2019 ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ ఫేజ్‌లో రెండు కారిడార్లు ఉన్నాయి. 

“దేశాన్ని బలోపేతం చేయాలంటే రాష్ట్రాలను బలోపేతం చేయడం అవసరం. అందుకే కేంద్ర ప్రభుత్వం తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ లేదా ‘వోకల్ ఫర్ లోకల్’ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల వల్ల తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. విజయ్‌ ప్రభుత్వానికి కేంద్రం చేయూత అందిస్తోంది” అని ప్రధాని భరోసా ఇచ్చారు.

రెండో దశకు కేంద్ర మంత్రి అమిత్ షా 2020 నవంబర్ 21న శంకుస్థాపన చేశారు. రెండో దశలో మరో మూడు కారిడార్లు ఉన్నాయి.

  • కారిడార్ 3: మాధవరం నుంచి సిప్‌కాట్ వరకు 45.8 కి.మీ. ఉంటుంది.
  • కారిడార్ 4: లైట్ హౌస్ నుంచి పూనమల్లి వరకు 26.1 కి.మీ. ఉంటుంది
  • కారిడార్ 5: మాధవరం నుంచి షోల్లింగనూర్ వరకు 47 కి.మీ. ఉంటుంది

చెన్నై మెట్రో రెండో దశలోని నాలుగో కారిడార్‌లో భాగంగా ఉన్న పూనమల్లి బైపాస్-వడపల్లి ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే సెకండ్ ఫేజ్‌లోని మూడు కారిడార్లలో ఏదీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 2028 నాటికి మొత్తం 118.9 కి.మీ. మూడు కారిడార్లను అందుబాటులోకి చెన్నై మెట్రో లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ప్రారంభమైన మార్గంలో 11 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అవి పూనమల్లి బైపాస్, పూనమల్లి బస్టాండ్, పూనమల్లి గవర్నమెంట్ హాస్పిటల్, కరయాంచవాడి, కుమానాంచవాడి, కట్టుపక్కమ్, అయ్యప్పంథగల్, థెల్లియారాగారం, పోరూర్ బైపాస్, పోరూర్ జంక్షన్, వడపళని.

 
2028 నాటికి రెండో దశ పూర్తయితే చెన్నై నగరంలో 173 కి.మీ. మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుంది. దేశంలో అత్యధిక పొడవైన మెట్రో మార్గం ఉన్న నగరాల జాబితాలో చెన్నై నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. తొలి స్థానంలో ఢిల్లీ, రెండో స్థానంలో ముంబై, మూడో స్థానంలో బెంగళూరు ఉంటాయి. ఈ కొత్త మెట్రో లైన్ చెన్నై నగర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.  

ఐఐటీ మద్రాస్‌లో బ్రెయిన్ సెంటర్ జాతికి అంకితం

చెన్నైలో రూ.13 వేల కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన జరిపారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 3,700 కోట్లతో ఎన్ హెచ్-744, ఎన్ హెచ్-83 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. పలు రైల్వే లైన్లు సహా పోర్టుల సామర్థ్యాలను పెంచే ప్రాజెక్టులు, అలాగే ఆధునికీకరించిన 5 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్‌లో సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని, మనిషి మెదడుకు సంబంధించిన 3డి అట్లాస్ మిషన్‌ను, స్ట్రోక్ అట్లాస్‌ను ఆవిష్కరించారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లోనూ ప్రధాని పాల్గొన్నారు.

 

About The Author