ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హావా.. బీజేపీకి మరో లోక్ సభ సీట్!

* ఉప ఎన్నికల ఫలితాల పట్ల ప్రధాని మోదీ హర్షం 
 
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా కొనసాగింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ అధికార పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు.  పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం సాధించగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, అస్సాంలోనూ అధికార పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలకు అనుకూలంగా కనిపిస్తుండటంతో  ఉప ఎన్నికల పోరులో ప్రతిపక్షాలకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది.దేశవ్యాప్తంగా ఐదు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది.  బంగాల్‌, అసోంలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది.  అసోంలో నగావ్ లోక్‌సభ స్థానంతో పాటు బంగాల్‌లోని నందిగ్రామ్‌, రెజినగర్‌ అసెంబ్లీ స్థానాలను కమలదళం సొంతం చేసుకుంది. తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార టీవీకే పార్టీ హవా కొనసాగించింది. పుదుచ్చేరిలోని తట్టంచావడి స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్ ఆనంద్ 8 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అసోం నాగావ్ లోక్ సభ స్థానంలో బిజెపి గెలుపు 

అసోంలోని నాగావ్ లోక్ సభ స్థానానికి నిర్వహించిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవశిష్ శర్మ తన సమీప ప్రత్యర్థి, ఏఐయూడీఎఫ్ చీఫ్ మహ్మద్ బద్రుద్దీన్ అజ్మల్‌పై 1.72 లక్షల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శిబమొణి బోరా 1.17 లక్షల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2024లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది.
 
పార్లమెంటుకు తిరిగి వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఉప ఎన్నికలో పోటీ చేసిన మాజీ లోక్‌సభ ఎంపీ అజ్మల్‌కు ఈ ఫలితం పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. అస్సాంలో బీజేపీ, ఏఐయూడీఎఫ్, కాంగ్రెస్ మధ్య జరిగిన ఈ త్రిముఖ పోరుపై అందరి దృష్టి నెలకొంది. మాజీ ఐఏఎస్ అధికారి అయిన శర్మ, బీజేపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రద్యుత్ బోర్డోలోయ్ విజయం సాధించిన నియోజకవర్గంలోనే శర్మ ఇప్పుడు గెలుపొందడం గమనార్హం. 
 
కాంగ్రెస్ ఎంపీ పదవికి బోర్డోలోయ్ రాజీనామా చేసి బీజేపీలో చేరడం, ఆ తర్వాత డిస్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ విజయం, కాంగ్రెస్ మూడవ స్థానానికి పరిమితం కావడం అనేది నాగౌన్ ఎన్నికల పోరులో వచ్చిన మార్పును సూచిస్తుంది. అజ్మల్ అభ్యర్థిత్వం ద్వారా తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావించిన ఏఐయూడీఎఫ్‌కు కూడా ఈ ఫలితం గట్టి దెబ్బగా మారింది.

నందిగ్రామ్‌ దేశంలోనే మూడో అతిపెద్ద మెజార్టీ

పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయ సాధించింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి కంచుకోట నందిగ్రామ్‌లో ఆ పార్టీ అభ్యర్థి హాసి రాణి రథ్ తన సమీప ప్రత్యర్థిపై 1.2 లక్షలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ జరిగిన ఉప-ఎన్నికల్లో నమోదైన అత్యధిక మెజార్టీల్లో మూడో స్థానంలో నిలిచారు. 
 
ఈ జాబితాలో మహారాష్ట్ర బారామతి ఉప-ఎన్నికలో సునేత్రా పవార్ 2.18 లక్షల ఓట్ల మెజార్టీతో మొదటి స్థానంలో, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గటోల్డియాలో 1.92 లక్షల ఓట్ల మెజార్టీతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ  తృణమూల్ కాంగ్రెస్ చీలిక వర్గం డెమొక్రాటిక్ తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యర్థికి కేవలం 853 ఓట్లు మాత్రమే పడ్డాయి.  రెజీనగర్‌లో బీజేపీ అభ్యర్థి శంఖరవ్ సర్కార్ 75 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది.
బీజేపీ అభ్యర్థికి 1,29,914 ఓట్లు పోలవగా, రెండో స్థానంలో నిలిచిన గోలమ్ నబీ ఆజాద్‌కు 54,098 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు 6168 ఓట్లు రాగా, మమత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (దీదీ వర్గం)కు 3847 ఓట్లు వచ్చాయి. సీపీఎంకు 3797 ఓట్లు, టీఎంసీ రెబల్ వర్గం డెమొక్రాటిక్ టీఎంసీకి 2044 ఓట్లు వచ్చాయి. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీకి భారీ మెజార్టీ రావడం గమనార్హం.

విజయ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నికలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది.  రెండూ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు. మధురాంతకం అసెంబ్లీ స్థానం నుంచి టీవీకే అభ్యర్థి మరగతం కుమారవేల్ 20,302 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.  ధారాపురం నుంచి టీవీకే అభ్యర్థి సత్యభామ 9471 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తమిళనాడులో డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచారు.

పుదుచ్చేరిలోని తట్టన్‌చావడి ఎన్నికల ఫలితం ఉదయం 11 గంటలలోపే వెల్లడైంది. అధికార ఆలియాండి ఎన్ రంగస్వామి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ ఆనంద్ 8482 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వినాయగంపై గెలిచారు.

బెంగాల్‌లో రెండు అసెంబ్లీ సీట్లు, అసోంలో పార్లమెంట్ సీట్లో బీజేపీ విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ప్రజలు తమకు వరుసగా మద్దతుగా నిలుస్తూ, తమను ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో, అసోంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే కూటమి పాలనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

అలాగే, పుదుచ్చేరిలో కూడా ఎన్‌డీయే భాగస్వామి ఏఐఎన్‌ఆర్‌సీ గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ ప్రజలు ఇండియా బ్లాక్ కూటమిని మరోసారి తిప్పికొట్టారని తెలిపారు.

About The Author