ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం మరోసారి భారత ఐటీ రంగంలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్యాప్‌జెమినీ, అడోబ్, కాగ్నిజెంట్ కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ ప్రక్రియకు ఉపయోగించే `పెర్మ్’ (పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్) నుంచి ఈ 8 కంపెనీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్న తరుణంలో దిగ్గజ ఐటీ స్టాక్స్ చాలా వరకు 52 వారాల కనిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ జులై- సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాల వేళ రాణిస్తాయని చూస్తుండగా అమెరికా ప్రభుత్వం నుండి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే అక్టోబర్ 8న టీసీఎస్ క్యూ2 ఫలితాల్ని ప్రకటించగా ఆ షేరు కూడా గురువారం పతనమైంది. ఇప్పుడు టీసీఎస్ ఫలితాల తర్వాత ఐటీ రంగ భవిష్యత్తుపై కొత్త సందేహాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే ట్రంప్ సర్కార్ నిర్ణయం ఇప్పటికే అమెరికా స్టాక్ మార్కెట్ లో ప్రభావం చూయించింది. అక్కడి స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతున్న విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్‌లు ఇప్పటికే రాత్రికి రాత్రి 3 శాతం వరకు పతనం అయ్యాయి. దీంతో శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్ పరిస్థితులపై చర్చ మొదలైంది. ఇన్వెస్టర్లు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పరిణామం ఒక్కటే దేశీయ ఐటీ షేర్ల తదుపరి దశను నిర్ణయిస్తుందని ఇప్పటికిప్పుడు చెప్పలేం.
అమెరికా కార్మికశాఖ మంత్రి కీత్ సాండర్లింగ్ ప్రకటించిన నిర్ణయం ప్రకారం పైన చెప్పిన 8 కంపెనీల నుంచి కొత్త పెర్మ్ దరఖాస్తులను స్వీకరించరు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను కూడా నిలిపివేస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా కొన్ని సంస్థలు విదేశాల నుంచి నిపుణులను నియమించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. అమెరికాలోని నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వాలనేదే తమ ఉద్దేశం అని స్పష్టం చేశారు.
యూఎస్ లేబర్ మినిస్ట్రీ ప్రకారం 2009 నుంచి ఈ కంపెనీలు సుమారు 30 లక్షల మంది విదేశీ ఉద్యోగులకు సంబంధించి దరఖాస్తులు సమర్పించాయి. వాటిల్లో 2.3 లక్షలకుపైగా హెచ్1- బీ వీసా అనుమతులు, లక్షకుపైగా శాశ్వత నివాస ధ్రువీకరణలు లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. హెచ్1బీ అనేది అర్హత కలిగిన విదేశీ నిపుణులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి ఉపయోగించే వీసా. పెర్మ్ అంటే ఉద్యోగి తరఫున యజమాని గ్రీన్ కార్డు ప్రక్రియలో ముందుకు వెళ్లేందుకు అవసరమయ్యే కార్మిక ధ్రువీకరణ విధానం. పెర్మ్ ద్వారా గ్రీన్ కార్డుకు అప్లై చేసుకొని అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకునే వీలుంటుంది.

More Stories
70 శాతం దాకా తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు
జీఎస్టీ అధికారుల అరెస్ట్ అధికారాలను రద్దు
యూపీఐపై ఎండీఆర్ ఛార్జీల అమలు వాయిదా?