ఏపీలో పాకిస్థాన్‌ స్పై నెట్‌వర్క్‌ కలకలం

ఏపీలో గూఢ‌చ‌ర్యం వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌తో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం అయింది. కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ జరిపిన దాడుల్లో మెుత్తం 18 మందిని గుర్తించగా వారిలో 13 మంది నేవీ సిబ్బంది అనుమానితులుగా గుర్తించారు. 12 కౌంటర్ ఇంటెలిజెన్స్‌ బృందాలతో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వ‌హించారు. 

ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. వీరిరువురూ పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. డబ్బు కోసం పాకిస్థాన్‌కు రహస్య సమాచారం అందిస్తున్న నేవీ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే విశాఖ నేవల్ బేస్ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కూడా కౌంటర్ ఇంటిలిజన్స్ బృందాలు అరెస్ట్ చేశాయి.

కోయంబత్తూర్‌లో ప్రదీప్‌ ముఖర్జీని అరెస్ట్ చేసిన అధికారులు విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేసేందుకు వాట్సాప్ యాక్టివేట్ చేయడానికి ఓటీపీ షేర్ చేసి సున్నితమైన సమాచారం అందిస్తున్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో ప్రదీప్‌నకు ఈనెల 14 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.  మొత్తం 13 మంది నేవీ సిబ్బందితో సహా 18 మంది అనుమానితులను కౌంటర్ ఇంటిలిజన్స్ బృందం విచారించింది.

అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలలో ఎన్‌క్రిప్టెడ్‌ ఛానళ్ల ద్వారా పాకిస్థాన్‌ కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌తో నేరుగా టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు.  భారత్‌ కు చెందిన రహస్య సమాచారాన్నిసేకరించి పాక్‌ ఆపరేటివ్‌కు చేరవేసినట్లు సమాచారం. నేవీ, రక్షణ సంస్థల సమచారమే టార్గెట్‌గా గూఢచర్యం చేసినట్లు తెలుస్తోంది.  విశాఖ ప‌ట్నం కేంద్రంగా గూఢ‌చ‌ర్యం వ్య‌వ‌హారం కొన‌సాగిన‌ట్లు ఏపీ సీఐ సెల్ గుర్తించింది.  ఏపీ, కేరళ, మహారాష్ట్ర సహా 10 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.  

పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో అనుమానితులకు సంబంధాలు ఉన్నాయా? ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల ద్వారా సున్నితమైన సమాచారాన్ని చేరవేశారా? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలోని నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి విదేశీ ఆపరేటివ్స్‌కు చేరవేసేందుకు ప్రయత్నాలు జరిగాయా? అనే అంశంపై దర్యాప్తు సాగుతోంది. 
 
సోదాల్లో లభించిన ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 18 మంది అనుమానితుల్లో ఇద్దరి పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
 
ఈ కేసులో విశాఖపట్నానికి చెందిన సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్ను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఆపరేటివ్‌కు చేరవేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ సమాచారాన్ని చేరవేసినందుకు ఆయనకు నగదు లేదా ఇతర ప్రయోజనాలు అందాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో సాయి వరప్రసాద్‌ను విశాఖ జిల్లా జైలుకు తరలించారు.
 
మరోవంక, తాజాగా నేవీలో మరో హనీట్రాప్ ఘటన వెలుగుచూడటంతో కేంద్ర నిఘా సంస్థలు, నేవీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఉలిక్కిపడ్డాయి. సైలర్ ప్రదీప్ ముఖర్జీ, వ్యూహాత్మక ఆస్తులు, యుద్ధనౌకల సమాచారాన్ని శత్రుదేశానికి ఏ మేరకు చేరవేశాడన్న దానిపై లోతుగా విచారణ సాగిస్తున్నాయి. హవాలా లేదా డిజిటల్ రూపంలో ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నాయి.
 
  

About The Author