భారత వాయుసేనకు తదుపరి అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా సేవలందిస్తున్న ఆయన, వాయుసేన 29వ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 31 ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజున నూతన ఎయిర్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ వాయుసేనలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ ఫైటర్ పైలట్. 1966 డిసెంబర్ 9న జన్మించిన దీక్షిత్ 1986 డిసెంబర్ 6న భారత వాయుసేన ఫైటర్ స్ట్రీమ్‌లో చేరారు. అప్పటి నుంచి వివిధ కీలక హోదాల్లో సేవలందించిన ఆయనకు ఆపరేషనల్, శిక్షణ, విధాన రూపకల్పన, విమాన పరీక్షలు, వ్యూహాత్మక ప్రణాళిక వంటి విభాగాల్లో విస్తృత అనుభవం ఉంది.
ఆయన ప్రయాణంలో ఫైటర్ పైలట్‌గా మాత్రమే కాకుండా ప్రయోగాత్మక టెస్ట్ పైలట్, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఎయిర్ మార్షల్ దీక్షిత్‌కు 3,500 గంటలకు పైగా విమాన ప్రయాణ చేశారు. అలాగే భారత వాయుసేనలోని పలు కీలక యుద్ధ, శిక్షణ విమానాలను నడిపిన అనుభవం కూడా ఉంది.
మిరాజ్-2000, వివిధ మిగ్ సిరీస్ విమానాలు, కిరణ్, జాగ్వార్, ఐఎల్-78, హాక్‌తో పాటు స్వదేశీ తేజస్లోనూ ఆయన ప్రయాణించారు. ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా పనిచేసిన అనుభవం, భవిష్యత్ విమాన సాంకేతికత, యుద్ధ సామర్థ్యాలపై ఆయనకు ప్రత్యేక అవగాహనను కల్పించింది. అశుతోష్ దీక్షిత్ కెరీర్లో పలు ముఖ్యమైన సైనిక ఆపరేషన్లలో కూడా పాల్గొన్నారు.
కార్గిల్ యుద్ధ సమయంలో చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్, దేశంలోని అంతర్గత భద్రతకు సంబంధించిన ఆపరేషన్ రక్షక్, ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో కూడా కీలక పాత్ర పోషించారు. ఫైటర్ స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించడంతో పాటు పశ్చిమ రంగంలోని కీలక ఫైటర్ ఎయిర్‌బేస్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. దక్షిణ ప్రాంతంలోని ఫైటర్ ట్రైనింగ్ బేస్‌కు కూడా నాయకత్వం వహించారు.
వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టకముందు ఆశుతోష్ దీక్షిత్ సెంట్రల్ ఎయిర్ కమాండ్‌కు అధిపతిగా పనిచేశారు. అనంతరం చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా సేవలందించారు. అంతకుముందు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ రిక్వైర్మెంట్స్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్), అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్లాన్స్) వంటి బాధ్యతలు కూడా నిర్వహించారు.

More Stories
భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన
సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో బిజెపి విజయం
దేశంలో అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్న రాహుల్