ఎస్ఐఆర్ నిరసనలతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ నిలిపివేత

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా విపక్షాలు శుక్రవారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నవారి సంఖ్య 700 దాటింది.

ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే సంజీవ్ ఝాలను కూడా ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్దే అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ అరెస్టులు చేశారని, అయితే తమ ఉద్యమం కొనసాగుతుందని ఆప్ తెలిపింది. ఇదిలా ఉండగా, భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ మెట్రో, రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, జంతర్ మంతర్ సహా సెంట్రల్ ఢిల్లీలోని 12 స్టేషన్లలోకి ప్రవేశ నిష్క్రమణలను తాత్కాలికంగా మూసివేసింది. నిరసన ప్రదేశంలో, సమీప ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.

 
ఢిల్లీలో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకుండా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్  జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు, ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అలాగే, ఆప్, ఏఐఎస్ఏ, ఎన్ఎస్యుఐ,ఇండియన్ యూత్ కాంగ్రెస్‌లు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టాయి.
 
సెప్టెంబరు 26లోగా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకుంటే.. అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలలు చేపడతామని సీజేపీ ప్రకటించింది. ‘‘సీఈసీ నియామకం పారదర్శకంగా జరగాలి.. ఇందులో పౌర సమాజ భాగస్వామ్యం ఉండాలి’’ అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ విషయంలో సీఈసీపై సీజేపీ, ప్రతిపక్షాలు విమర్శలు గుపిస్తున్న సీజేపీ, ప్రతిపక్షాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని అధికారులు ముందుగానే స్పష్టం చేశారు. దీంతో జంతర్‌ మంతర్‌కు వెళ్లే మార్గాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్‌ స్ట్రీట్‌, జనపథ్‌, టాల్స్టాయ్‌ మార్గాలతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను మోహరించారు. పోలీసులు నిరసనకారులను బస్సుల్లో తరలిస్తుండగా కొన్ని ప్రాంతాల్లో ఇతర ఆందోళనకారులు, మద్దతుదారులు వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు.

About The Author