జీఎస్టీ వసూళ్లు మరోసారి రూ.2 లక్షల కోట్లు దాటాయి. ఇప్పటికే జూలై, ఆగస్టు నెలల్లో రూ.2 లక్షల కోట్లు దాటిన స్థూల జీఎస్టీ కలెక్షన్స్.. సెప్టెంబర్ లోనూ 14.7 శాతం పెరిగి రూ.2,03,521 కోట్లకు చేరాయి. గత ఏడాది సెప్టెంబర్లో రూ.1,77,173 కోట్లుగా ఉన్న వసూళ్లతో పోలిస్తే ఈసారి గణనీయమైన పెరుగుదల నమోదైంది. వరుసగా మూడో నెలలోనూ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు దాటడం గమనించవలసిన విషయం.
ఈ సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ ద్వారా రూ.37,762 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ ద్వారా రూ.45,363 కోట్లు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ వసూళ్లు రూ.1,20,396 కోట్లుగా నమోదయ్యాయి. సెటిల్మెంట్ల తర్వాత నికర జీఎస్టీ ఆదాయం 18.1 శాతం పెరిగి రూ.1,76,520 కోట్లకు చేరింది. దేశీయంగా వసూలైన జీఎస్టీ ఆదాయం కూడా పెరిగింది. సెప్టెంబర్లో ఇది 10.1 శాతం వృద్ధితో రూ.1,37,996 కోట్లకు చేరింది.
దిగుమతులపై వసూలైన జీఎస్టీ ఆదాయం పెరగడం మొత్తం వసూళ్ల వృద్ధికి దోహదం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలి ఆరు నెలల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.12,46,278 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 11.6 శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్ 7న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెద్దగా పన్ను రేట్ల మార్పులు ఉండకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి.
జీఎస్టీ 2.0 లో భాగంగా ప్రక్రియల సరళీకరణ, ఈ-ఇన్వాయిసింగ్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిబంధనలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమలు చేసిన పన్నురేట్ల మార్పులు ఎలా పనిచేస్తున్నాయన్న దాన్ని కూడా జీఎస్టీ కౌన్సిల్ సమీక్షించనుంది.

More Stories
లక్షద్వీప్ లో రూ.3 వేల కోట్ల డ్రగ్స్ సీజ్.. ఐదుగురు పాకిస్థానీయులు అరెస్ట్
గోధుమలు, పప్పు ధాన్యాలకు రబీ మద్దతు ధర పెంపు
రూ.2,700 ఔషధానికి రూ.27,000 వేల ఎమ్మార్పీ.. సుప్రీం దిగ్బ్రాంతి