పండుగల వేళ పప్పుల ధరలు సామాన్య ప్రజలకు షాకిస్తున్నాయి. నిత్యావసరాలైన పప్పుధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా శనగ, కంది, పెసర లాంటి పప్పుల ధరలు గత కొన్ని వారాల్లోనే చుక్కలనంటాయి. ‘ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్’ గణాంకాల ప్రకారం కొన్ని రకాల పప్పుల హోల్‌సేల్ ధరలు గడిచిన నెల రోజుల్లోనే 11 శాతానికిపైగా పెరిగాయి.
దేశంలో అత్యధికంగా వినియోగించే శనగపప్పు ధర నెల రోజుల్లో 11 శాతం, వారం రోజుల్లో 5.5 శాతం పెరిగింది. పెసరపప్పు 10.6 శాతం, కందిపప్పు 6.5 శాతం, బఠాణీ 6 శాతం మేర పెరిగాయి. గడిచిన ఏడాదితో పోలిస్తే శనగపప్పు ధర 23 శాతం, బఠాణీ 47 శాతం, మినప పప్పు ధర 24 శాతం అధికంగా ఉన్నాయి. సోమవారం నాటి రిటైల్ మార్కెట్ సగటు ధరలను పరిశీలిస్తే కిలో శనగపప్పు రూ.88.72, కందిపప్పు రూ.125.72, పెసరపప్పు రూ.112.14, మసూర్ పప్పు రూ.90.43 గా నమోదయ్యాయి.
పండుగ సీజన్ కావడంతో ఇళ్లలో నిత్యావసర సరుకుల నిల్వలు పెంచుకోవడం ఈ ధరల పెరుగుదలకు తక్షణ కారణంగా కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక బలమైన సరఫరా ఆందోళనలు కూడా ఉన్నాయని వ్యాపారులు, పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా పప్పుధాన్యాలను అధికంగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, నేలలో తేమ తగ్గడం వంటి కారణాలతో ఖరీఫ్ పంట దిగుబడిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రత్యేకంగా కందిపప్పు ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది.
రానున్న రబీ సీజన్‌లో శనగ సాగుపైనా కొన్ని ప్రతికూల పరిస్థితులు ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నేలలో తేమ తక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలు శనగ ఉత్పత్తిపై ఒత్తిడి పెంచే అవకాశముంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా భారత్‌కు పూర్తిగా అనుకూలంగా లేవని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌కు శనగను ప్రధానంగా సరఫరా చేసే ఆస్ట్రేలియాలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే బఠాణీ సరఫరాలో కీలకమైన రష్యా నుంచి దిగుమతులు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
పప్పుల ధరల పెరుగుదలపై ఆందోళనలు ఉన్నప్పటికీ దేశంలో ప్రస్తుతం తక్షణ కొరత లేదని సంబంధిత గణాంకాలు సూచిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 274.09 లక్షల టన్నుల పప్పుధాన్యాల ఉత్పత్తి నమోదైనట్లు సమాచారం. అదేవిధంగా ప్రభుత్వం వద్ద సుమారు 45 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సరఫరా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి లేకపోయినా.. భవిష్యత్లో కొరత ఏర్పడవచ్చన్న అంచనాలు మార్కెట్లో ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

More Stories
రూ.2,700 ఔషధానికి రూ.27,000 వేల ఎమ్మార్పీ.. సుప్రీం దిగ్బ్రాంతి
స్పామ్ కాల్స్ చేసే నంబర్లపై ఏఐ నిఘా
అమెరికాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్న ఎస్సార్ గ్రూప్